
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరించాలి
జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ
ఏలూరు(మెట్రో): జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణ లక్ష్యాలను సాధించేందుకు పటిష్టమైన ప్రణాళికతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ ఎం.జె.అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో సోమవారం ఖరీఫ్‌లో ధాన్యం సేకరణ లక్ష్యాలు, ప్రణాళికలపై అధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతుల నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించామని, ఒక్క రైతుకీ ఎలాంటి సమస్య రాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గోనె సంచులు, రవాణా, హమాలీ చార్జీలు, తేమ శాతం తదితర సమస్యలు, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ముందుగానే చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం సేకరణ కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు జాప్యం లేకుండా రైస్ మిల్లులకు తరలించాలని, ధాన్యం సేకరణలో రైతులు, మిల్లర్లు, రవాణా పరమైన ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకీదేవి, డీఎస్‌ఓ విలియమ్స్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజరు శివరామమూర్తి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్‌కె హబీబ్ బాషా, డీసీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.