
ప్రతి అర్జీకీ పరిష్కారం చూపాలి
ఏలూరు(మెట్రో): పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి సోమవారం కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అధికారులు అర్జీలను క్షుణ్నంగా అధ్యయనం చేసి తమ సిబ్బందితో నిర్ణీత గడువు లోగా పరిష్కారం చూపాలన్నారు. ఫిర్యాదు పరిష్కారానికి సమయం అవసరం ఉన్నప్పుడు సంబంధిత విషయాన్ని ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడాలని అన్నారు. ఫిర్యాదులు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబంధిత శాఖకు ఎండార్స్ చేసి పంపాలని, అర్జీలు రీఓపెన్ కాకుండా సమస్యలు పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను కలెక్టరు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింటు కలెక్టరు అభిషేక్ గౌడ, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, కెఆర్‌ఆర్‌సి స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కె.భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.