
అప్రదక్షిణ మార్గంలో క్యూలైన్ నిర్మాణమా?
న్యాయ పోరాటం చేస్తా
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో అప్రదక్షిణ మార్గంలో దర్శనం క్యూలైన్ల నిర్మాణాలు చేపట్టడం ఆగమశాస్త్ర విరుద్ధమంటూ ఓ ఆధ్యాత్మిక వేత్త ఇటీవల రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై దేవస్థానం అధికారులను కమిషనర్ రిమార్క్స్ అడగడంతో ఆ నిర్మాణ పనులకు తాజాగా బ్రేక్ పడింది. ద్వారకాతిరుమల దివ్య క్షేత్రాన్ని సందర్శించే భక్తుల సౌకర్యార్ధం రూ.12.50 కోట్లతో చేపట్టిన నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇదిలా ఉంటే క్యూ కాంప్లెక్స్‌లోని భక్తులు ముందుగా దక్షిణ రాజగోపురం లోంచి ఆలయంలోకి చేరుకుని, అక్కడి నుంచి తూర్పువైపుకు తిరిగి క్యూలైన్ల గుండా శ్రీవారి దర్శనానికి వెళ్లేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగానే తూర్పు వైపున ఉన్న పాత క్యూలైన్లలో కొన్నింటిని తొలగించి, అక్కడ ఎత్తయిన కాంక్రీటు చప్టాను నిర్మించారు. దానిపై కొత్త క్యూలైన్లు నిర్మించాల్సి ఉంది. ఏలూరుకు చెందిన ఆధ్యాత్మిక వేత్త, హైకోర్టు న్యాయవాది బీకేఎస్‌ఆర్ అయ్యంగార్ ఈ క్యూలైన్ నిర్మాణ పనులు అప్రదక్షిణంగా జరుగుతున్నాయంటూ దేవదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
అప్రదక్షిణం ఎలా అంటే..
భక్తులు దక్షిణ రాజగోపురం లోంచి ఆలయంలోకి ప్రవేశించగానే, పడమర వైపు (ఎడమ వైపు)కు తిరిగి శ్రీవారి దర్శనానికి వెళ్లాలని, అలా కాకుండా తూర్పు వైపు (కుడి వైపు)కు తిరిగి వెళ్లడం అప్రదక్షిణమని, ఇది పూర్తిగా ఆగమశాస్త్ర విరుద్దమని అయ్యంగార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కమిషనర్ దేవస్థానం అధికారులను రిమార్క్స్ అడగడంతో కాంక్రీటు చప్టాపై క్యూలైన్ నిర్మాణ పనులకు బ్రేక్ పడింది.
అర్చకులకు తప్పని ఇక్కట్లు
గతంలో ఆలయ పడమర వైపు అర్చకులకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఉండేవి. అభివృద్ధి పనుల్లో భాగంగా ఏడాదిన్నర క్రితం వాటిని తొలగించారు. ఇప్పటి వరకు తిరిగి నిర్మించలేదు. దాంతో ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అర్చకులు కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తే.. తమ ఇళ్లకు పరుగులు తీయాల్సి వస్తోంది. నిత్యం దేవుడి సేవలో ఉండే అర్చకుల పరిస్థితే ఇలా ఉంటే ఎలా అని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.
దగ్గరగా నిర్మిస్తేనే సౌకర్యం..
ఆలయానికి దగ్గరగా, అందుబాటులో నిర్మించిన కట్టాడాలనే భక్తుల ఎక్కువగా వినియోగిస్తున్నారు. దూరంగా ఉన్న వాటికి పాధాన్యత అంతంత మాత్రమనే చెప్పాలి. ప్రస్తుతం ఆలయ తూర్పు ప్రాంతంలో రూ. 12 కోట్లతో విస్తరిస్తున్న అనివేటి మండపం, రూ.12.50 కోట్లతో నిర్మిస్తున్న క్యూ కాంప్లెక్స్ దేవాలయానికి దగ్గరగా ఉన్నాయి. ఇవి సౌకర్యవంతంగా ఉంటాయి. ఆరేళ్ల క్రితం ఆలయానికి దూరంగా రూ.2.50 కోట్లతో ఆధునీకరించిన మాధవుని కుంట నిరుపయోగంగా మారింది. అలాగే రూ.8.50 కోట్లతో నిర్మించిన కల్యాణకట్ట భక్తులకు అసౌకర్యంగా ఉండటంతో, కొండపైన సెంట్రల్ పార్కింగ్ ప్రాంతంలో షెడ్లు నిర్మించి కల్యాణ కట్టను అందులోకి మార్చే యోచనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. రూ. 4.10 కోట్లతో నిర్మించిన క్యాంటీన్ ఆలయానికి దూరంగా, మూలన ఉండటంతో భక్తులు అందులోకి వెళ్లేవారు కాదు. ఫలితంగా క్యాంటీన్ నిర్వహించలేమని ప్రైవేట్ వ్యాపారులు, ఒకానొక దశలో దేవస్థానం అధికారులు చేతులెత్తేశారు. దాంతో కొన్నాళ్లుగా కొండపైన క్యాంటిన్ లేక భక్తులు అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు తూర్పువైపు సప్తగోకుల ప్రాంతంలో తాత్కాలికంగా క్యాంటీన్ ఏర్పాటు చేసుకుని, మూడేళ్లపాటు నిర్వహించుకునే హక్కుకు దేవస్థానం ఈనెల 17న టెండర్, బహిరంగ వేలాన్ని నిర్వహించనుంది.
దేవదాయ శాఖ కమిషనర్‌కు
ఆధ్యాత్మిక వేత్త ఫిర్యాదు
శ్రీవారి ఆలయంలో ఆగమ విరుద్ధంగా అప్రదక్షిణ మార్గంలో క్యూలైన్లు నిర్మిస్తుండటంపై ఇటీవల రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాను. మాధవుని కుంటకు పెట్టిన రూ.2.50 కోట్ల ఖర్చు, నృసింహ సాగర అభివృద్ధికి పెట్టి ఉంటే బాగుండేది. ఇప్పటికై నా పుష్కరిణిని అభివృద్ధి చేసి, పూర్వ ఆచార సాంప్రదాయాలను కొనసాగించాలి. లేకుంటే న్యాయపోరాటం చేస్తాను.
– బీకేఎస్‌ఆర్ అయ్యంగార్, ఆధ్యాత్మిక వేత్త, హైకోర్టు న్యాయమూర్తి

అప్రదక్షిణ మార్గంలో క్యూలైన్ నిర్మాణమా?