
మందుబాబులకు అడ్డాగా.. శ్రీవారి పుష్కరణి
● మెట్లపైనే మద్యం, బీరు సీసాలు, సిగరెట్లు
● అధ్వానంగా ఉన్న పుష్కరణిలోని నీరు
ద్వారకాతిరుమల: ప్రతి ఏటా కార్తీకమాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీవారి తెప్పోత్సవాన్ని నిర్వహించే నృసింహ సాగరం (పుష్కరణి) అధ్వానంగా మారింది. రాత్రి అయితే చాలు మందు బాబులు సాగరం మెట్లపైకి చేరి మద్యం, బీరులు, ఖాళీ సీసాలను అక్కడే పడేస్తున్నారు. కాల్చి పడేసిన సిగరెట్టు పీకలు, ఖాళీ పెట్టెలు మెట్లపక్కన దర్శనమిస్తున్నాయి. ఏకంగా బీరు సీసాలను సాగరం వద్ద ఉన్న గణేషుడి విగ్రహం పక్కనే పెడుతున్నారు. పుష్కరిణి సైతం చెత్తా, చెదారం, మురుగుతో దారుణంగా ఉంది. పురాణ పాశస్త్యం గల ఈ సాగరాన్ని సందర్శించేందుకు నిత్యం సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు వీటిని చూసి విస్తుపోతున్నారు. పవిత్రమైన ప్రదేశం ఇంత దారుణంగా ఉంటే ఆలయ అధికారులు ఏం చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. పూర్వం ఈ సాగరం వద్దే భక్తులు మొక్కులు తీర్చుకుని, స్నానాలు ఆచరించి, ఆలయానికి వెళ్లేవారు. స్వామివారికి నిత్యం తీర్ధపు బిందె ఇక్కడి నుంచే వెళ్లేది. ఇప్పుడు ఆ ఆచారం కొనసాగడం లేదు. తెప్పోత్సవాన్ని మాత్రం ఏటా దేవస్థానం వైభవంగా నిర్వహిస్తోంది. ఆ ఉత్సవ సమయంలో మాత్రమే సాగరాన్ని, పరిసరాలను అధికారులు ముస్తాబు చేస్తున్నారు. ఆ తరువాత మళ్లీ పట్టించుకోవడం లేదు. దాంతో పుష్కరిణి ప్రాంతం మందుబాబులకు అడ్డాగా మారింది. ఇప్పటికై నా ఆలయ అధికారులు స్పందించి పుష్కరిణి అభివృద్ధికి కృషి చేయాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. అలాగే సెక్యురిటీని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, పుష్కరణి పవిత్రతను, భక్తుల మనోభావాలను కాపాడాలని అంటున్నారు.

మందుబాబులకు అడ్డాగా.. శ్రీవారి పుష్కరణి