
కాల్వలో పడి బాలుడి గల్లంతు
తణుకు అర్బన్: బాలుడు కాలువలో పడి గల్లంతైన ఘటన పైడిపర్రులో ఆదివారం చోటుచేసుకుంది. తణుకు బ్యాంక్ కాలనీలో నివసిస్తున్న బొమ్మనబోయిన జోగీంద్ర నందు(13) ఆదివారం తన స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు తణుకులోని పైడిపర్రు ప్రాంతానికి వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో కాలువ రేవులోకి దిగి స్నానం చేసేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు. స్థానికులు గమనించి కాల్వలో గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో తణుకు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్సై కె.చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని పోలీసు, ఫైర్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లితండ్రులు ప్రమాదప్రాంతానికి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు.
ఏలూరు టౌన్: ఏలూరు శివారు వట్లూరు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతిచెందాడు. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. ఏలూరు శివారు వట్లూరు రైల్వే ఫ్‌లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం రైలు ప్రమాదంలో మృతిచెందాడు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించగా...అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడి ఎత్తు 5.5 అడుగులు, చామన చాయ రంగుతో, తెలుపు నలుపు చారల చొక్కా, బిస్కెట్ రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతని వయసు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీలో భద్రపరిచామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
దెందులూరు: సానిగూడెం గ్రామంలో భర్త, అత్తతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్న వివాహిత నేతల లీలామణి (19) అనుమానాస్పద స్థితిలో శనివారం రాత్రి మృతి చెందింది. స్థానికులు, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ నిర్వహించి కేసు నమోదు చేశామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.