
నేడే ఎంటీఎస్ ఉపాధ్యాయుల విజ్ఞాపన సభ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) ప్రాతిపదికన ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వారికి ఉద్యోగాలు కల్పించి వారికి జీవితంలో ఆశలు చిగురింపచేశారు. వారిలో ఎక్కువ మంది పదవీ విరమణ వయసుకు దగ్గర పడుతుండడంతో ఉద్యోగం వచ్చిందనే ఆనందం ఎంతోకాలం మిగిలే పరిస్థితి కనిపించడంలేదు. రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం మెరుగైన ఉద్యోగ భద్రత కల్పించాలని, మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ఎంటీఎస్ ఉపాధ్యాయులు ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఈ నెల 11న విజయవాడ ధర్నా చౌక్‌లో ఉద్యమించడానికి కార్యాచరణ రూపొందించుకున్నారు. 60 సంవత్సరాలకే పదవీ విరమణను వ్యతిరేకిస్తున్నారు. 62 సంవత్సరాలకు పదవీ విరమణ వయసు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సర్వీసులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్ సౌకర్యం కల్పించాలని, దీని వలన కొంత మేరకు ఉద్యోగ భద్రత లభిస్తుందని భావిస్తున్నారు.