
పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలి
ఏలూరు (మెట్రో): జిల్లాలో అంటువ్యాధులు వ్యాపించకుండా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, పాఠశాలలు, వసతి గృహాలలో గురువారం నాటికి పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి నీటి ట్యాంకులు శుభ్రపరిచే పనులను పూర్తి చేయించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం పారిశుద్ధ్యం, తాగునీటి వనరుల పరిశుభ్రత, విద్యార్థులకు ఫీవర్ సర్వే, వైద్య పరీక్షలు, జీఎస్టీ అవగాహన, సదరం క్యాంపుల నిర్వహణ, తదితర అంశాలపై కలెక్టర్ ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
కోకో నాణ్యతపై దృష్టి పెట్టాలి
కోకో సాగు, పంటకోత తర్వాత నిర్వహణలో ఆధునిక పద్ధతులపై వర్క్‌షాపులో కలెక్టరు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ నాణ్యమైన కోకో మంచి ధర పలుకుతుందని, దేశంలోనే ఏలూరు జిల్లా కోకో సాగులో మొదటి స్థానంలో ఉందని, అదే స్ఫూర్తితో నాణ్యమైన కోకో సాగు చేసేలా రైతులు దృష్టి పెట్టాలన్నారు.
పటిష్ట చర్యలు తీసుకోవాలి
జిల్లాలో ఎలాంటి బాణసంచా ప్రమాదాలు సంభవించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జిల్లాలో బాణసంచా ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, అనధికార తయారీ, నిల్వలు, అమ్మకాల నియంత్రణపై బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్‌తో కలిసి సమీక్షించారు. అలాగే ఔషధాలు, జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్టీ తగ్గింపు గురించి ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు.