ఆంధ్రా ‘పెరటి’లో ఆఫ్రికా ‘రక్కసి’ | - | Sakshi
Sakshi News home page

ఆంధ్రా ‘పెరటి’లో ఆఫ్రికా ‘రక్కసి’

Oct 1 2025 10:01 AM | Updated on Oct 1 2025 10:01 AM

ఆంధ్ర

ఆంధ్రా ‘పెరటి’లో ఆఫ్రికా ‘రక్కసి’

వారానికి మూడు రోజులు ఇలా చేస్తే సరి

తాడేపల్లిగూడెం : పెరటి తోటల రైతులను ఆఫ్రికా నత్తలు వణికిస్తున్నాయి. మొన్నటి దాకా విశాఖ, మన్యం జిల్లా రైతులను కలవరానికి గురిచేసి.. తాజాగా ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలపై దాడి చేశాయి. అయితే వీటి ఉనికిని రైతులు ఐదు నెలల తర్వాత గుర్తించడంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బొప్పాయి, జామ వంటి పంటలతో పాటు మినుము పైరుకూ తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితుల్లో ఆఫ్రికా నత్తల సమస్యకు పరిష్కారం చూపేందుకు డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తోటల బాట పట్టారు.

వందేళ్ల కిందటే వలస

ఆఫ్రికా నత్తలు వందేళ్ల కిందటే భారత దేశానికి వలసొచ్చాయి. తోట పంటలపై వీటి దాడి మూడేళ్లగా మొదలైంది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆఫ్రికా నత్తలు విజృంభించాయి. కేరళ నుంచి వక్క చెట్లను ఇక్కడకు దిగుమతి చేసుకోవడంతో ఆఫ్రికా నత్తల ప్రభావం ఉభయగోదావరి, మన్యం, విశాఖ జిల్లాలకు వ్యాపించింది. పార్వతీపురం, మన్యం జిల్లా, విశాఖ జిల్లా ఎస్‌.కోట ప్రాంతాల్లో ఆఫ్రికా నత్తల దాడిని రైతులు వెంటనే గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని జొన్నాడ ప్రాంతంలోనూ వీటి ఉనికి బయటపడింది. తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం మినుము తోటపై ఆఫ్రికా నత్తల దాడిని గమనించారు. ఇదే మండలంలోని ఆవపాడులోనూ ఈ నత్తల ఆనవాళ్లను కనిపెట్టారు. ఆఫ్రికా నత్తలు గుడ్లను ఏటా జూలై నుంచి ఫిబ్రవరి వరకు పెడతాయి. ఒక్కో నత్త వంద నుంచి 400 వందల వరకు గుడ్లు పెడుతుంది. నత్త జీవితకాలం ఐదేళ్ల నుంచి ఆరేళ్లు. ఈ సమయంలో ఒక్కో నత్త సుమారు వెయ్యి నుంచి 1,200 పిల్లలకు జన్మనిస్తుంది. తుప్పలు, ఆకుల కింద, వెలుతురు తగలని ప్రాంతాల్లో ఇవి నివశిస్తాయి. బొప్పాయి, అరటి, జామ, కూరగాయలు, మొక్కజొన్న, పత్తి, వక్క, ఆయిల్‌పామ్‌ పంటలతో పాటుగా నర్సరీలను ఆశ్రయించి రైతులకు అపార నష్టం కలిగిస్తాయి.

ఏమరుపాటుతో భారీ మూల్యం

ఇతర ప్రాంతాల నుంచి మొక్కలను ఇక్కడకు తీసుకొచ్చే సమయంలో వాటిపై నత్తల గుడ్లు, చిన్న చిన్న నత్తలు వంటివి ఉన్నాయేమో రైతులు జాగ్రత్తగా గమనించాలి. వాటిని నిర్మూలించాకే వక్క వంటి మొక్కలను ఇక్కడకు తెచ్చుకోవాలి. ఈ విషయాన్ని విస్మరించామో.. ఆ తర్వాత భారీమూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. నీరు ఎక్కువగా ఉండే వరి పంటను ఆఫ్రికా నత్తలు ఆశించవు. వీటికి వాతావరణం అనుకూలించే చిత్తడి నేలల్లోకి వెవెళ్లి ఉంటాయి.

జాగ్రత్తలిలా..

● పంట తోటలను ఒత్తుగా వేసుకోకూడదు.

● తోటల్లో కలుపు, చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి.

● అంతర సేద్యంపై దృష్టి పెట్టాలి.

● రాత్రులు తోటల్లో నీరు పారించకూడదు.

● తోటల్లో కోళ్లు, బాతులను పెంచుకోవాలి.

ఆఫ్రికా నత్తల నివారణకు ఒక కిలో ఉప్పును నాలుగు లీటర్ల నీటిలో కలిపి ఆ నీటిలో గోనె సంచిని తడిపి గట్లపై వేస్తే ఈ సంచులపైకి వెళ్లిన నత్తలు ద్రావణం ఘాటుకు చనిపోతాయి. ఆకర్షక ఎర ఏర్పాటులో భాగంగా 25 కిలోల వరి తవుడుకు వంద గ్రాముల థయోడీకార్బ్‌ గుళికలు, మూడు కిలోల బెల్లం, వంద గ్రాముల ఆముదాన్ని కలిపి చిన్న ఉండలుగా చేయాలి. ఈ ఉండలను బొప్పాయి, క్యాబేజీ ఆకుల కింద పెట్టాలి. వీటిని తిన్న ఆఫ్రికా నత్తలు చనిపోవడం లేదా నిర్వీర్యం అయిపోతాయి. అనంతరం వీటిని ఉప్పు ద్రావణంలో వేస్తే చనిపోతాయి. ఇలా వారానికి రెండు మూడు రోజుల పాటు 15 రోజుల వరకూ చేయాలి. నత్తలను ఏరివేసే సమయంలో చేతికి గ్లౌజులు ధరించాలి.

– గోవిందరాజులు, విస్తరణ సంచాలకులు,

చలపతిరావు, శాస్త్రవేత్త

పెరటి తోటలను కబళిస్తున్న ఆఫ్రికా నత్తలు

నిన్న విశాఖ, మన్యం.. నేడు ఉభయగోదావరి జిల్లాలపై దాడి

బొప్పాయి, జామ, అరటి, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం

వణికిపోతున్న అన్నదాతలు

ఉప్పు ద్రావణంతో నిర్మూలన చేయాలంటున్న ఉద్యాన శాస్త్రవేత్తలు

ఆంధ్రా ‘పెరటి’లో ఆఫ్రికా ‘రక్కసి’1
1/4

ఆంధ్రా ‘పెరటి’లో ఆఫ్రికా ‘రక్కసి’

ఆంధ్రా ‘పెరటి’లో ఆఫ్రికా ‘రక్కసి’2
2/4

ఆంధ్రా ‘పెరటి’లో ఆఫ్రికా ‘రక్కసి’

ఆంధ్రా ‘పెరటి’లో ఆఫ్రికా ‘రక్కసి’3
3/4

ఆంధ్రా ‘పెరటి’లో ఆఫ్రికా ‘రక్కసి’

ఆంధ్రా ‘పెరటి’లో ఆఫ్రికా ‘రక్కసి’4
4/4

ఆంధ్రా ‘పెరటి’లో ఆఫ్రికా ‘రక్కసి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement