
హత్యగా మారిన మిస్సింగ్ కేసు?
తణుకు అర్బన్: గత నాలుగు రోజులుగా తణుకులో సంచలనం రేకెత్తించిన యువకుడి అదృశ్యం కేసు కాస్త హత్య కేసుగా మలుపు తిరిగింది. తాడేపల్లిగూడెంకు చెందిన మడుగులు సురేష్ (25) ఆచూకీ కోసం మంగళవారం పోలీసు అధికారులు గోస్తనీ కాలువ, చించినాడ బ్రిడ్జి ప్రాంతాల్లో చేసిన గాలింపు చర్యలు చేపట్టారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాథ్ గాలింపు చర్యలను పరిశీలించారు. ఆజ్ఞాతంలో ఉన్న న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజు, నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిచ్చిన సమాచారంతోనే గాలింపు చర్యలు చేపట్టారంటూ గుప్పుమంది. అయితే సురేష్, న్యాయవాది భార్య శిరీషతో అత్యంత సన్నిహితంగా ఉండేవాడని ఇటీవల గౌరీపట్నం కూడా కలిసివెళ్లారని తెలుస్తోంది. దీంతో వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగిందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇందుకు నిదర్శనంగా సురేష్, శిరీష కలిసి ఉన్న ఫొటోలను సురేష్ కుటుంబ సభ్యులు బయటకు విడుదల చేశారు.
25న వెలుగులోకి మిస్సింగ్..
ఈనెల 23వ తేదీన సురేష్ తణుకు వచ్చి మరలా తాడేపల్లిగూడెం రాలేదని అతడి సోదరి ప్రశాంతి ఈనెల 25న తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన మిస్సింగ్ వ్యవహారం తణుకులో సంచలనం రేకెత్తించింది. న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజు భార్య శిరీషతో సురేష్ సన్నిహితంగా ఉంటాడని ఆయనపైనే అనుమానంగా ఉందంటూ చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. అయితే న్యాయవాదితోపాటు తణుకుకు చెందిన మరో నలుగురు వ్యక్తులు అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఆరోపణలకు బలం చేకూరింది. పట్టణ సీఐ ఎన్.కొండయ్య ప్రత్యేక బృందాన్ని నియమించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మంగళవారం ఉదయం నిందితులను తణుకు తీసుకువచ్చి విచారిస్తున్నట్లుగా సమాచారం.
స్టేషన్ వద్ద ఉద్రిక్తత...
సురేష్ అదృశ్యంపై ఫిర్యాదు చేసి వారం రోజులు గడిచినా ఇంతవరకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ తాడేపల్లిగూడెంకు చెందిన బాధితవర్గాలు తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్ ముందు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సీఐ కొండయ్య బయటకు వచ్చి విచారణకు సహకరించాలని విజ్ఞప్తి చేయడంతో గొడవ సద్దుమణిగింది.
పోలీసులను పక్కదారి పట్టిస్తున్న నిందితులు!
పోలీసులను నిందితులు పక్కదారి పట్టిస్తున్నారని సురేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం డీఎస్పీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు ఈతగాళ్లు, బాఽధిత వర్గాల సాయంతో తణుకు గోస్తనీ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. తీరా మధ్యాహ్నం మరలా చించినాడ బ్రిడ్జి ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో నిందితులు ముందుగానే పక్కా ప్రణాళిక వేసుకుని పోలీసులను పక్కదారి పట్టిస్తున్నారని అంటున్నారు. ఈనెల 23న కొందరు వ్యక్తులు సురేష్‌ను తణుకులోని ఒక శ్మశానవాటికలో గట్టిగా కొట్టినట్లుగా తెలిసిందని బాధితవర్గాలు చెబుతున్నారు.