
భారీ వర్షంతో ఇక్కట్లు
వీరవాసరం: వీరవాసరం మండలం వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మూడు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పల్లపు ప్రాంతాల్లోని డ్రెయిన్లు వర్షపు నీటితో నిండి కాలువలుగా మారాయి. ఈ వర్షాలు వరి రైతులకు ఎంతో అనుకూలంగా ఉంటుందని పేర్కొంటున్నారు. రాయకుదురు–చింతల కోటి గరువు వెళ్లే ప్రధాన రహదారిపై రెండు భారీ కొబ్బరి చెట్లు పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండలంలోని పలుచోట్ల విద్యుత్ స్తంభాలు గాలికి ఒరగడంతో విద్యుత్‌కు అంతరాయం కలిగింది. సంబంధిత శాఖ అధికారులు తక్షణం స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు.
గూడెంలో భారీ వర్షం
తాడేపల్లిగూడెం (టీఓసీ): గూడెంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం పడింది. గంటకుపైగా వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ వేడిమితో ఇబ్బంది పడిన ప్రజలు సాయంత్రం కురిసిన భారీ వర్షంతో సేద తీరారు. పల్లపు ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాలలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లలో సాంకేతిక సమస్యలు, విద్యుత్ లైన్లలో సమస్యలు ఏర్పడ్డాయి. విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

భారీ వర్షంతో ఇక్కట్లు