
ఎరల వాడకం.. రైతులకు లాభం
నూజివీడు: వివిధ పంటలను ఆశించే పురుగుల వల్ల రైతాంగానికి ఏటా తీరని నష్టం వాటిల్లుతోంది. వీటిని అరికట్టేందుకు వేలాది రూపాయలను వెచ్చించి రసాయన మందులను కొనుగోలు చేసి పిచికారీ చేసినా నష్టాన్ని పూర్తిగా అరికట్టలేకపోతున్నాము. ఈ నేపథ్యంలో రైతులు రసాయన మందులపైనే ఆధారపడకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే స్థిరమైన, నాణ్యమైన ఉత్పత్తులను సాధించడానికి వీలవుతుందని నూజివీడు వ్యవసాయాధికారి పలగాని చెన్నారావు పేర్కొంటున్నారు. ఈ చర్యల్లో భాగంగా ఎరల వినియోగం గురించి రైతులు అవగాహన కలిగి ఉండాలని చెబుతున్నారు. కీటకాల స్వభావం, వాటిని ఆకర్షించే ఎరలు తదితర అంశాలపై వ్యవసాయాధికారి రైతులకు పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు.
లింగాకర్షక ఎరలు
పంటలపై వాలే మగ రెక్కల పురుగుల్ని సహజంగా ఆడ రెక్కల పురుగులు ఆకర్షిస్తాయి. దీనికి గాను ఆడ రెక్కల పురుగుల తల, రెక్కలు, కాళ్లు, జననాంగాల నుంచి కొన్ని రసాయనాలను విడుదల చేస్తాయి. ఈ రసాయనాలనే కృత్రిమంగా తయారుచేసి లింగాకర్షక ఎరలుగా రూపొందిస్తున్నారు. ఈ ఎరలు ప్రధానంగా మగ రెక్కల పురుగుల ఉధృతిని అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. వీటిని పాలిథిన్ సంచుల్లో, గరటా ఆకారపు పాత్రల్లో ఉంచి పొలం మధ్యలో నాలుగైదు అడుగుల ఎత్తులో కర్రలు పాతి వాటి చివరన ఎరలను ఉంచుతారు. దీని ద్వారా మగపురుగులు వచ్చి సంచుల్లో పడి చనిపోతాయి. వీటి సంఖ్యను ఆధారంగా పురుగుల ఉధృతి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు.
దీపపు ఎరలు
గొంగళి పురుగు జాతికి చెందిన రెక్కల పురుగులు, కొన్ని రకాల పెంకు పురుగులు పంటలను ఆశించి తీవ్రంగా నష్ట పరుస్తాయి. వీటిని నాశనం చేసేందుకు తెల్లని కాంతిని విరజిమ్మే విద్యుత్ దీపాల్ని రాత్రిపూల 7 నుంచి 11 గంటల మధ్య పొలంలో అక్కడక్కక్కడా ఏర్పాటు చేస్తే ఈ పురుగులు కాంతికి ఆకర్షితమవుతాయి. వరిలో కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగు, చెరకులో పీకపురుగు, కాండం తొలిచే పరుగు, పత్తి, కందిలో కాయతొలిచే పురుగు, వేరుశనగలో ఎర్ర గొంగళి పురుగు, వేరు పురుగు దీపపు ఎరల చేత ఆకర్షింపబడతాయి. సాగుచేసే పంటను బట్టి పొలంలో 1.2 మీటర్ల ఎత్తులో దీపాల్ని ఏర్పాటు చేసుకోవాలి. వాటికింద వెడల్పాటి తొట్టిలో క్రిమిసంహారక మందు కలిపిన నీటిని ఉంచాలి. దీపాల వద్దకు చేరుకునే రెక్కల పురుగులు ఈ విషపు ద్రావణంలో పడి చనిపోతాయి. విద్యుత్ బల్బులు ఏర్పాటు చేసుకోలేని రైతులు రాత్రి సమయంలో సామూహికంగా మంటలువేస్తే రెక్కల పురుగులు అందులో పడి చనిపోతాయి.
ఎర పంటలు
పురుగుల నిర్మూలనకు ఎరపంటలు కూడా బాగా దోహదపడతాయి. పత్తిలో శనగపచ్చ పురుగు నివారణకు బంతి, తలనత్త పురుగు నివారణకు బెండ, పొగాకు లద్దె పురుగు నివారణకు ఆముదం మొక్కలను అక్కడక్కడా వేసుకోవాలి. దీనివల్ల ప్రధాన పంటకు పురగుతాకిడి తగ్గుతుంది. ఎరపంటపైనే పురుగు మందు పిచికారీ చేసి ఆయా పురుగులను తేలికగా నివారించుకోవచ్చు. తద్వారా రైతులకు సస్యరక్షణ నిమిత్తం పెట్టే పెట్టుబడులు కూడా తగ్గుతాయి.
పసుపు రంగు ఎరలు
పత్తి, మినుము, వంగ వంటి పంటలను ఆశించే తెల్లదోమల నిర్మూలనకు, వాటి ఉధృతిని అంచనా వేయడానికి పసుపు రంగు ఎరలు ఉపయోగపడతాయి. తెల్లదోమ జాతి పురుగులు పసుపు రంగుకు ఆకర్షితమవుతాయి. దీనికి గాను రేకులకు పసుపురంగు వేసి వాటికి జిగురు రాసి ఎకరాకు 5 చొప్పున ఏర్పాటు చేసుకుంటే ఈ తెల్లదోమలు రేకుల వద్దకు వచ్చి వాటికి అతుక్కొని చనిపోతాయి. అంతేగాకుండా రేకుల వద్దకు వచ్చే పురుగుల సంఖ్యను బట్టి వాటి తీవ్రతను అంచనా వేయడానికి వీలవుతుంది.

ఎరల వాడకం.. రైతులకు లాభం

ఎరల వాడకం.. రైతులకు లాభం

ఎరల వాడకం.. రైతులకు లాభం