
విశ్వకర్మ యోజనతో సాధికారత
ఏలూరు(మెట్రో): విశ్వకర్మను ప్రపంచంలోనే మొట్టమొదటి వాస్తు శిల్పిగా భావిస్తారని కలెక్టర్ కె.వెట్రిసెల్వి పేర్కొన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా బుధవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో కలెక్టర్ కె.వెట్రిసెల్వి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సంప్రదాయ కళా నైపుణ్యాలు కలిగిన వారికి ప్రయోజనం కలిగించేలా విశ్వకర్మ యోజన ద్వారా ప్రభుత్వం సాధికారిత కల్పించేందుకు కృషిచేస్తుందన్నారు. విశ్వబ్రాహ్మణ నాయకులు తెలియజేసిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని, సూచనలను తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ విజయరాజు పాల్గొన్నారు.