
కాలువలో బాలుడి గల్లంతు
పాలకోడేరు: వేండ్ర అగ్రహారం శివారు కట్టావారిపాలెంలోని గోస్తని డ్రెయిన్‌లో ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తూ ఓ బాలుడు పడి గల్లంతయ్యాడు. గ్రామానికి చెందిన బొక్కా శ్రీనివాస్‌రావు రెండవ కుమారుడు జైదేవ్ (7) నౌడూరులోని ప్రైవేట్ స్కూల్‌లో ఒకటవ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో మరో బాలుడు చరణ్‌తో కలిసి సైకిల్ తొక్కుకుంటూ గ్రామంలోని గోస్తని డ్రెయిన్‌పై ఉన్న బ్రిడ్జి పైకి వెళ్లారు. ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుంచి బాలుడు జైదేవ్ కాలువలోకి పడిపోయాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. సోమవారం కాకినాడ నుంచి ఏపీఎస్‌డీఆర్‌ఎఫ్ బలగాలు వచ్చి గాలిస్తున్నారు. జై దేవ్ తండ్రి శ్రీనివాస్ రావు లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బాలుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.