
యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు
కొయ్యలగూడెం: రాజవరం పంచాయతీ గంగవరం గ్రామంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు గత కొద్ది రోజులుగా యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గంగవరం సమీపంలోని కొండ ప్రాంతమైన సర్వే నెంబర్ 205, 206, 207లలో సుమారు 20 ఏళ్ల క్రితం అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం దళితులకు అరవై ఎకరాలకు పైగా సాగు భూమిగా కేటాయించి పట్టాలు అందజేశారు. వాటిలో రైతులు కొందరు జీడి మామిడి తోటలు వేయగా మరికొన్ని భూములు ఖాళీగా ఉన్నాయి. అటువంటి వాటిని గుర్తించి అక్రమార్కులు గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రోజుకు 40 నుంచి 60 ట్రిప్పుల గ్రావెల్ మట్టి ట్రక్కుల ద్వారా సుదూర ప్రాంతాలకు రవాణా అవుతోందని ఇందులో అన్ని రాజకీయ పార్టీల నాయకుల భాగస్వామ్యం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. కొద్ది నెలల క్రితం డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఇదే ప్రాంతంలో కొనసాగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలను స్వయంగా చూడడం జరిగిందన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి సేకరిస్తున్న గ్రావెల్ మట్టిపై విచారణ చేసి అక్రమ తవ్వకాలపై తనకు నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. తిరిగి అదే కొండ ప్రాంతంలో ఇప్పుడు భారీ ఎత్తున గ్రావెల్ అక్రమ తవ్వకాలు కొనసాగుతుండడంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా అక్రమ గ్రావెల్ తవ్వకాల విషయాన్ని తహసీల్దార్ ఎన్.నాగరాజు దృష్టికి తీసుకువెళ్లగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
సూదిగట్టు తవ్వేస్తున్నారు
ఆగిరిపల్లి: కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి మండలంలోని సహజ వనరులను దర్జాగా దోచుకుంటున్నారు. రాత్రి అయితే చాలు మండలంలో కొండలను, గుట్టలను, అడిగే వారు లేకపోవడంతో అడ్డగోలుగా తవ్విస్తున్నారు. వడ్లమానులో సూది గట్టు వద్ద ఆదివారం అర్ధరాత్రి అక్రమంగా తవ్వకాలు జరిపి గ్రావెల్‌ను తరలించిపోతుండగా గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి కనీసం ఎటువంటి కేసులు నమోదు చేయకుండా వెళ్లిపోయారు. ఆ తర్వాత యథావిధిగా గ్రావెల్ తవ్వకాలు జరిగాయి. అమ్మవారి గూడెం గ్రామంలోని మాల గట్టు, ఈదులగూడెం, నరసింగపాలెంలో కూడా గ్రావెల్ మాఫియా అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం తమకేమీ సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సహజ వనరులైన మట్టి, గ్రావెల్‌ను అక్రమార్కులు తరలించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు

యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు