
డ్వాక్రా సొమ్ము రూ.58 లక్షలు స్వాహా
ఆగిరిపల్లి: డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు అక్రమార్కుల చేతిలో మోసపోవడం పరిపాటిగా మారింది. ఆగిరిపల్లి మండలం సీతారామపురంలో ఏవోఏగా పనిచేస్తున్న దిడ్డి భార్గవి డ్వాక్రా మహిళల సొమ్ము ఏకంగా రూ.58 లక్షలు స్వాహా చేసింది. ఏపీఎం రికార్డుల పరిశీలనతో ఈ వ్యవహారం బయటపడింది. వివరాల ప్రకారం దిడ్డి భార్గవి 12 ఏళ్లుగా వీవోఏగా విధులు నిర్వహిస్తోంది. ఆమె పరిధిలో 38 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి.వీరి ఖాతాలు ఈదర గ్రామంలోని ఇండియన్ బ్యాంకులో ఉన్నాయి. గ్రామానికి బ్యాంకు దూరంగా ఉండటం, నిరక్షరాస్యులైన మహిళల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మహిళలు బ్యాంకుకు చెల్లించాల్సిన డ్వాక్రా రుణాలను తానే చెల్లిస్తానని నమ్మించి కొన్ని నెలలు సజావుగానే చెల్లించింది. గత కొన్ని నెలలుగా సుమారు 28 స్వయం సహాయక సంఘాల్లో ఒక నెల సభ్యులు బ్యాంకుకు వెళ్లి చెల్లిస్తుండగా, మరో నెల భార్గవికి ఇస్తున్నారు. ఆమె బ్యాంకులో చెల్లిస్తున్నానని నమ్మించి సొమ్ములు కట్టడం లేదు. ఇటీవల బదిలీపై వచ్చిన ఏపీఎం రాజశేఖర్ స్వయం సహాయక సంఘాల రికార్డులను పరిశీలించడంతో ఈమె వ్యవహారం బయటపడింది. డీఆర్‌డీఏ డీపీఎంలు విజయ్ కుమారి, ఎంఎస్‌డీ భూషణం నిధుల స్వాహాపై సోమవారం గ్రామంలో బహిరంగ విచారణ చేపట్టారు. విచారణలో రూ.58 లక్షలు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. వీవోఏ భార్గవి డబ్బులు వెంటనే చెల్లించాలని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. తనకు రెండు నెలల సమయం ఇస్తే ఆ డబ్బులు చెల్లిస్తానని భార్గవి అధికారులను కోరింది. ఈ సందర్భంగా డీఆర్‌డీఏ అధికారులు మాట్లాడుతూ వీవోఏ అవినీతికి పాల్పడినట్లు గుర్తించామని, ఉన్నతాధికారులకు నివేదిక పంపిన తర్వాత తదుపరి విషయాలు తెలియజేస్తామన్నారు. సీ్త్ర నిధి ఏజీఎం చెన్నకేశవులు, సర్పంచ్ అత్తి మురళి, ఏపీఎం డి.రాజశేఖర్, సీసీ దివ్య పాల్గొన్నారు.