
అథ్లెటిక్స్ జిల్లా జట్ల ఎంపిక
తణుకు అర్బన్: పశ్చిమ గోదావరి జిల్లా అండర్ 14, 16, 18, 20 బాలుర, బాలికల జిల్లా జట్ల ఎంపికలు తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో సోమవారం నిర్వహించినట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంకు సూర్యనారాయణ తెలిపారు. ఎంపికై న జట్లలోని క్రీడాకారులు ఈ నెల 27 నుంచి 29వ తేదీల్లో ఏలూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరుకాగా వీరిలో ప్రతిభ కనబరచిన 42 మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. అసోసియేషన్ చైర్మన్ మానేపల్లి శ్రీనివాస్ క్రీడాకారులకు భోజన వసతి కల్పించి సర్టిఫికెట్లు, మెడల్స్ అందచేశారు.
ఉత్సాహంగా అథ్లెటిక్స్ జట్ల ఎంపిక
ఏలూరు రూరల్: ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో సోమవారం జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపిక పోటీలు ఉత్సాహంగా జరిగాయి. అండర్–14, 16, 18, 20 విభాగంలో బాలబాలికలకు వేరు వేరుగా ఎంపిక పోటీలు చేపట్టారు. రన్నింగ్, షాట్‌పుట్, జావలిన్, డిస్కస్, హేమర్‌త్రో పాటు హైజంప్, లాంగ్‌జంప్ అంశాల్లో అథ్లెట్లు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డారు. సుమారు 250 మంది బాలబాలికలు పోటీలకు హాజరయ్యారని కార్యదర్శి దేవరపల్లి ప్రసాద్ చెప్పారు. ఎంపికై న అథ్లెట్లు ఈ నెల 26వ తేదీ నుంచి 29 వరకూ ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జరిగే అంతర జిల్లాల పోటీల్లో పాల్గొంటారని వివరించారు. అసోసియేషన్ చైర్మన్ ఆదిరెడ్డి సత్యనారాయణ, అధ్యక్షుడు గుళ్ల ప్రసాద్, ట్రెజరరీ ఏ శ్రీనివాసరావు, రిటైర్డ్ హెచ్‌ఎం జల్లా వీరభద్రరావు హాజరయ్యారు.