
వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి
ఏలూరు (టూటౌన్): వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, తొలగించిన వికలాంగుల పింఛన్లు పునరుద్ధరించాలని, ఇండ్లు లేని వికలాంగులకు ఇంటి స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించాలని వికలాంగుల సేవా సంఘం జిల్లా సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. స్థానిక ఆర్‌ఆర్ పేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపం నందు నిర్వహించిన జిల్లా సమావేశానికి కుందేటి జయరాజు అధ్యక్షత వహించి మాట్లాడారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా బి.సోమయ్య, అధ్యక్షుడిగా కుందేటి జయరాజు, ఉపాధ్యక్షుడిగా డి.గంగాధర్ రావు, సీహెచ్.కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా ఎల్.రాంబాబు, సహాయ కార్యదర్శులుగా పల్లెం వెంకటేశ్వరరావు, కాటూరి సత్యనారాయణ, మహిళా విభాగం అధ్యక్షురాలిగా పి.చంద్రవాణి, పలువురు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
పోలవరం రూరల్: గోదావరి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలో నీటి ప్రవాహం పెరుగుతుండటంతో వరద ఉద్ధృతి పెరిగింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 31.200 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి సుమారు 7 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతోంది. ఎగువన భద్రాచలం వద్ద 39.70 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలోకి నీరు చేరడంతో వరద మరో రెండు రోజులు పెరిగే పరిస్థితి ఉందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.