
విద్యుత్ మోటార్లు, కేబుల్ వైర్ల దొంగల అరెస్టు
నూజివీడు: రైతుల పొలాల్లో విద్యుత్ మోటార్లు, కరెంటు తీగలను దొంగతనం చేసే ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నూజివీడు సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చాట్రాయి మండలంలోని పలు గ్రామాల పరిధిలోని పంట పొలాల్లోని వ్యవసాయ మోటార్లు, కరెంటు తీగలు ఇటీవల చోరీకి గురవుతున్నాయి. దీంతో రైతులు చాట్రాయి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై డీ రామకృష్ణ దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా ఫోన్ సిగ్నళ్లు ఆధారంగా చాట్రాయి మండలం తుమ్మగూడెంకు చెందిన యర్రా నాగవాసు, మాదాల భవానీశంకర్‌లను నిందితులుగా గుర్తించారు. వారిని సోమవారం తుమ్మగూడెం శివారు ఎన్నెస్పీ కాలువ వద్ద అరెస్టు చేసి, వారి నుంచి మూడు విద్యుత్ మోటార్లు, ఒక పంపుసెట్, 900 అడుగుల విద్యుత్ తీగను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్సై డీ రామకృష్ణతో పాటు హెడ్‌కానిస్టేబుల్ జీ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు కే మునీంద్రరావు, పీ వెంకటేశ్వరరావులను సీఐ అభినందించారు.