ఆటోవాలా.. బతుకు డీలా | - | Sakshi
Sakshi News home page

ఆటోవాలా.. బతుకు డీలా

Sep 12 2025 5:07 PM | Updated on Sep 12 2025 5:07 PM

ఆటోవాలా.. బతుకు డీలా

ఆటోవాలా.. బతుకు డీలా

సంక్షేమ చట్టాన్ని అమలు చేయాలి

దినదినగండంగా జీవనం

ఏలూరు (టూటౌన్‌): రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం అమలుతో ఆటో డ్రైవర్ల జీవనోపాధికి ఆటంకం ఏర్పడింది. రోజుకు 60 శాతం ఆదాయం కోల్పోయి వాహనాల కిస్తీలు కూడా కట్టులేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పని లేక, ఆదాయం లేక ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితితో సతమతమవుతున్నారు. కూటమి ప్రభుత్వం సీ్త్రశక్తి పథకంతో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో కిరాయిలు లేక ఆటో డ్రైవర్లు విలవిల్లాడుతున్నారు. ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల తామంతా వీధిన పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘాల నాయకులతో చర్చించి, ఆటో, క్యాబ్‌ డ్రైవర్ల ఉపాధికి నష్టం కలగని విధంగా ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ చర్య కారణంగా ఏలూరు జిల్లావ్యాప్తంగా 19 వేల మంది ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు వీధిన పడ్డారు. వీటిలో ఆటోలే 15 వేలు ఉండగా, మ్యాక్సీలు, క్యాబ్‌లు, ట్రాలీ వాహనాలు మరో 4 వేల వరకు ఉన్నాయి. ఈ మేరకు ఈ వాహనాల డ్రైవర్లు ఉచిత బస్సు పథకం ప్రవేశ పెట్టిన నాటి నుంచి తీవ్రంగా నష్టపోతున్నారు.

రూ.25 వేల చొప్పున ఇవ్వాలి

సూపర్‌ సిక్స్‌–సూపర్‌ హిట్‌ అంటూ అనంతపురంలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వాహన మిత్ర పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని, దసరా రోజున దీనిని అమలు చేస్తామని ప్రకటించారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదని, కేవలం రూ.15 వేలు ప్రకటించి చంద్రబాబు చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని యూనియన్‌ నాయకులు విమర్శిస్తున్నారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన హామీ మేరకు లైసెన్స్‌ ఉన్న ప్రతి డ్రైవర్‌కు (ఆటో, క్యాబ్‌, లారీ, బస్సు) ఏడాదికి రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

60 శాతం ఆదాయం కోల్పోయి..

రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకాన్ని ఆటో మోటార్‌ కార్మికుల సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా అమలు చేసింది. దీనివలన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో క్యాబ్‌ డ్రైవర్లు తమ ఆదాయంలో 60 శాతానికి పైగా నష్టపోతున్నారు. రవాణా రంగంలో ఉన్న కార్మికుల కుటుంబాలకు భరోసానిచ్చే విధంగా సమగ్ర సంక్షేమ చట్టాన్ని అమలు చేస్తామని, జీఓ నం.21 రద్దు చేస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. బ్రిటిష్‌ చట్టాల కంటే కఠినంగా తయారు చేసిన బీఎంఎస్‌ 106 (1)(2) చట్టాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. రవాణా రంగం ద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు పన్నుల రూపంలో ఆదాయం సమకూరుస్తుందని, అయినా రవాణా రంగ కార్మికులకు, ఆటో డ్రైవర్లకు ఒక సంక్షేమ చట్టాన్ని అమలు చేయకపోవడం ప్రభుత్వాల అసమర్థతను తెలియజేస్తుందని యూనియన్‌ నాయకులు విమర్శిస్తున్నారు. వీటన్నింటిపై ఎటువంటి ప్రకటన చేయకుండా వాహన మిత్ర ద్వారా కేవలం 3 లక్షల మందికి మాత్రమే వాహన మిత్ర (ఆటో క్యాబ్‌ ఓనర్లకు) పథకాన్ని ఇస్తామని ప్రకటన చేయడాన్ని ఏలూరు జిల్లా ఆటో అండ్‌ ట్రాలీ డ్రైవర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఖండిస్తోంది.

18న విజయవాడలో ధర్నా

రాష్ట్రవ్యాప్తంగా రవాణా రంగ కార్మికులందరికీ వర్తించేలా సంక్షేమ పథకాలు ప్రకటించాలని, వెల్ఫేర్‌ బోర్డును ఏర్పాటు చేయాలని, అధిక పెనాల్టీలను వసూలు చేసే విధంగా రూపొందించిన జీఓ 21ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈనెల 18న విజయవాడలో ధర్నాకు సమాయత్తమవుతున్నారు. ఉచితబస్సు పథకం అమలు చేస్తున్నందున నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు రూ.25 వేలు ఆర్థిక సాయాన్ని అందించాలని ఆటో, క్యాబ్‌ యూనియన్‌ నాయకులు ముక్త కంఠంతో కోరుతున్నారు.

ఉచిత బస్సుతో ఉపాధికి గండి

సీ్త్రశక్తి పథకంతో రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్లు

సమస్యలపై 18న విజయవాడలో ధర్నా

రూ.25 వేలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌

ఆటో, క్యాబ్‌, ట్రాలీ డ్రైవర్ల సంక్షేమం కోసం సమగ్ర సంక్షేమ చట్టాన్ని అమలు చేయాలి. యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ ఇచ్చిన హామీ మేరకు జీఓ 21ని రద్దు చేయాలి. ఆటో, క్యాబ్‌ డ్రైవర్ల జీవనోపాధికి మెరుగైన చర్యలు తీసుకోవాలి.

– జె.గోపి, జిల్లా కార్యదర్శి,

ఆటో, క్యాబ్‌ అండ్‌ ట్రాలీ డ్రైవర్స్‌ యూనియన్‌, ఏలూరు జిల్లా

సీ్త్ర శక్తి పథకంతో ఆటో డ్రైవర్ల జీవనం దినదినగండంగా మారింది. ప్రభుత్వం లైసెన్స్‌ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.25 వేలు ఆర్థిక సహాయం అందించాలి. అలాగే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి వారి కుటుంబాలకు భరోసా కల్పించాలి.

– చక్రాల అమర్‌ కుమార్‌, జిల్లా అధ్యక్షుడు,

ఆటో, క్యాబ్‌ అండ్‌ ట్రాలీ డ్రైవర్స్‌ యూనియన్‌, ఏలూరు జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement