
యూరియా కోసం రైతుల తిప్పలు
చింతలపూడి: యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారని సీపీఐ మండల కార్యదర్శి తొర్లపాటి బాబు అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. రైతులకు ఒక బస్తా యూరియాతోనే షాప్ యజమానులు సరిపెడుతుండడం దారుణమని అన్నారు. ఒక పట్టాదార్ పాస్ పుస్తకానికి ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారని, ఎక్కువ భూమి ఉన్న రైతుల పరిస్థితి ఏమిటని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చింతలపూడి మండలంలో యూరియా కొరతలేదని ప్రజాప్రతినిధులు అధికారులు చెప్పడం సబబు కాదన్నారు. యూరియా కోసం చింతలపూడి గ్రోమోర్ వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారన్నారు. రైతులకు అవసరమైన మేరకు యూరియాను సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చాట్రాయి: అల్పపీడనం కారణంగా చాట్రాయి మండలంలో బుధవారం రాత్రి 10 నుంచి 2 గంటల వరకు భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో ఏకథాటిగా కురిసిన వర్షానికి ప్రజలు భయాందోళన చెందారు. చెరువులు, ఉప్పు వాగు, రేడగి వాగుల్లో వరద ఉద్ధృతంగా ప్రవహించింది. ఉప్పువాగుకు వచ్చిన వరదతో చాట్రాయి గొల్లగూడెం, జనార్థనవరం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. పలు గ్రామాల్లో కాలనీలు జలమయం అయ్యాయి.
టి.నరసాపురం: మండలంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వాగులు ప్రవహించే మార్గాల్లో గురువారం వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రధానంగా మండలంలోని మక్కినవారిగూడెం – టి.నరసాపురం మార్గంలో కనకదుర్గ గుడి వద్ద జలవాగు, బండివారిగూడెం – మక్కినవారిగూడెం గ్రామాల మద్య గల ముగ్గురాళ్ళ వాగు, అప్పలరాజుగూడెం – మధ్యాహ్నపువారిగూడెం గ్రామాల మధ్య ఎర్రకాలువ వాగులు భారీ వర్షం కారణంగా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాల మధ్య వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
ఏలూరు (టూటౌన్): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అమలు జరిగి 35 సంవత్సరాలు పూర్తయినా నేటికీ ఎస్సీ, ఎస్టీల పట్ల వివక్షత కొనసాగుతూనే ఉందని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ అన్నారు. స్థానిక నరసింహారావుపేటలోని ఎస్‌ఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులపై వీఎన్‌ఎస్ చట్టం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఎస్సీ సామాజిక వర్గం మీద దాడులు పెరిగాయన్నారు. ఎస్సీల జోలికి వెళితే శిక్షించబడతాం అనే భావన వాళ్లలో కలగట్లేదన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యాంగ ధర్మ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ ఎన్‌ఏడీ పాల్ మాట్లాడుతూ చాలామంది ఈ చట్టం పట్ల అవగాహన లేక దుర్వినియోగం చేస్తున్న వ్యక్తుల్ని ప్రశ్నించలేని పరిస్థితి నేడు కనిపిస్తుందన్నారు. చట్టాన్ని దుర్వినియోగం చేయడానికి ఎవరూ ప్రయత్నం చేయొద్దని తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్, రాజేష్ పాల్గొన్నారు.
ఉప్పు వాగులో ప్రవహిస్తున్న వరద