
15 నుంచి ఉపాధ్యాయుల రణభేరి
నూజివీడు: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం నిమిత్తం ఈనెల 15 నుంచి 19 వరకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు జీ వెంకటేశ్వరరావు తెలిపారు. రణభేరి కార్యక్రమం పోస్టర్‌ను గురువారం నూజివీడులో యూటీఎఫ్ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు డీఏలను విడుదల చేయాల్సి ఉందని, ఇంత వరకు ఒక్క డీఏ కూడా విడుదల చేయలేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలన్నారు. ప్రభుత్వం లీప్ యాప్ ఒక్కటే ఉందంటూ గొప్పలు చెప్పుకుంటోందని, వాస్తవంగా అందులో గతంలో కంటే ఎక్కువ యాప్‌లు ఉన్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే యాప్‌ల భారాన్ని తగ్గించాలన్నారు. విద్యార్థుల పరీక్షలకు సంబంధించి మూల్యాంకనం పుస్తకాల విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్నే కొనసాగించాలన్నారు. యూటీఎఫ్ మహిళా కౌన్సిలర్ బత్తుల అనురాధ, నూజివీడు మండల అధ్యక్షురాలు బొద్దుకోళ్ల బాబూరావు, కార్యదర్శి మల్లెల చెన్నకేశవరావు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నిరసన వారం విజయవంతం చేయాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన నిరసన వారాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి బీ.రెడ్డి దొర పిలుపునిచ్చారు. నిరసన వారంలో భాగంగా తొలి రోజు గురువారం స్థానిక గవరవరం జిల్లా పరిషత్ పాఠశాలలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి దొర మాట్లాడుతూ నిరసన వారంలో భాగంగా 12న మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శన, 13, 14 తేదీల్లో ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించడం, 15న తాలూకా కేంద్రాల్లో, 16న జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన, 17న సీఎం, సీఎస్‌లకు మెయిల్స్, వాట్సాప్ ద్వారా సందేశాలు పంపుతామన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.