
బాల్యవివాహాల నిరోధానికి సమష్టిగా కృషి చేయాలి
ఏలూరు (టూటౌన్): బాల్య వివాహాలు నిరోధించడానికి సమష్టిగా కృషి చేయాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ కోరారు. బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలు, పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నివారణ చట్టాలపై గురువారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ భవనంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నప్రసాదు మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు ప్రతి గ్రామంలో బాల్యవివాహాలను నిరోధించడానికి తమ వంతు కృషి చేయాలని అన్నారు. పని ప్రదేశాల్లో, సంస్థల్లో మహిళలకు ఎదురయ్యే లైంగిక వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. దీనికి చట్టం ద్వారా ఆయా సంస్థల్లో ఒక కమిటీని ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఫిర్యాదు చేసుకోవడానికి వీలుగా ఆ కమిటీ వివరాలను సంబంధిత కార్యాలయాల ముందు ప్రదర్శించాలని తెలియజేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మహిళలపై జరిగే లైంగిక వేధింపులను ఎదుర్కోవటానికి న్యాయ సహాయం ఉచితంగా పొందవచ్చునని సూచించారు. కార్యక్రమంలో ట్రైనీ మాస్టర్ పి.రత్నరాజు, ఉమెన్ డెవలప్‌మెంట్ – చైల్డ్ వెల్ఫేర్ పీడీ ఏ.శారద, డీసీపీఓ డా.సీహెచ్.సూర్య చక్రవేణి, సీడీపీవోలు తులసి, పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.