
ట్రిపుల్ ఐటీ అభివృద్ధికి కృషి
డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏ నిర్ణయం కూడా వ్యక్తిగతంగా తీసుకోవడం లేదని, అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తరగతులు, పరీక్షలు నిర్వహిస్తున్నామని డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ పేర్కొన్నారు. ఈనెల 10న సాక్షిలో ‘పాలనలో విఫలం–సమస్యలతో సావాసం’ పేరుతో వచ్చిన కథనంపై గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మూడేళ్లకోసారి బీఓఎస్ సమావేశాలు నిర్వహించి సిలబస్‌లో మార్పు చేస్తారని, వ్యక్తిగత ఇష్టాలకు ఇందులో తావులేదన్నారు. వైస్ చాన్సలర్, డైరెక్టర్‌ల నియామకానికి నోటిఫికేషన్‌ను జారీచేశారని, ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ట్రిపుల్ ఐటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నామని పేర్కొన్నారు. హౌస్ కీపింగ్, సెక్యూరిటీ ఏజెన్సీల ఎంపికకు సంబంధించి ఇటీవల జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని, త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. విద్యావసరాలను బట్టి అధ్యాపకులను సర్దుబాటు చేసుకొని బోధనకు నియమించుకోవడం సర్వసాధారణమన్నారు. ట్రిపుల్ ఐటీలో సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం కాపలా కాస్తున్నా ఒక విద్యార్థి గోడ దూకి వెళ్లి మందు బాటిళ్లు తీసుకురావడం విచారకరమని, ఈ విషయం తెలియగానే హాస్టల్‌కు వెళ్లి ఆ మందు బాటిళ్లను స్వాధీనం చేసుకొని విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామన్నారు. పీయూసీ అకడమిక్ సంస్కరణల కమిటీ సిఫార్సు మేరకు ఇంటర్ పుస్తకాలను ప్రవేశపెట్టడం జరిగిందని వివరించారు.