
సరిహద్దుల్లో ఇసుక దందా
న్యూస్‌రీల్
పరిమితికి మించి లోడింగ్
గురువారం శ్రీ 11 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక కొని.. ఏలూరు జిల్లా సరిహద్దు గ్రామాల్లో డంప్ చేస్తారు. రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటించి తెలంగాణాకు తీసుకెళ్తారు.. ఇలా రోజుకు ఏకంగా 90 లారీలకు పైగా ఇసుకను పొరుగు రాష్ట్రానికి అక్రమంగా రవాణా చేసి భారీగా దండుకుంటున్నారు. టీడీపీ నేతలే నిర్వాహకులు కావడంతో అన్ని వ్యవస్థల సహకారం అందుతోంది. దీంతో గత మూడు నెలలుగా సరిహద్దులో ఇసుక దందా జోరుగా సాగుతోంది. గత వారంరోజుల వ్యవధిలో చింతలపూడి పరిసర ప్రాంతాల్లో తెలంగాణకు అక్రమంగా రవాణా అవుతున్న 21 లారీలను గుర్తించి కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేశారు. దీంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మూడు నెలలుగా వందల లారీలు ఒకే మార్గంలో ప్రయాణిస్తున్నా అధికారులు మౌనం వహించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొవ్వూరు నియోజకవర్గంలోని కొవ్వూరు, తాళ్ళపూడి, అన్నదేవరపేటలోని ఇసుక రీచ్‌ల్లో వందల లారీల ఇసుకను లారీ యజమానులు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం నుంచి కొవ్వూరు మార్గంలో వందలాది లారీలు ఉన్నాయి. స్థానిక లారీ యజమానులు కొందరు అధికార పార్టీ నేతలుగా చలామణి అవుతున్నారు. ఈ క్రమంలో ఎవరికి అనుమానం రాకుండా సరికొత్త ఇసుక వ్యాపారానికి తెరతీశారు. కొవ్వూరు నియోజకవర్గంలోని రీచ్‌ల్లో ఇసుకను బుక్ చేసి చింతలపూడి, తెలంగాణ సరిహద్దు గ్రామాలకు వే బిల్లులు తీసుకుంటారు. లారీ లేదా ట్రాక్టర్ ద్వారా చింతలపూడి సరిహద్దు ప్రాంతాల్లోని మేడిశెట్టివారిగూడెం, సీతానగరం, లింగగూడెం మరికొన్ని గ్రామాల్లో అక్కడక్కడ ఐదారు లారీల ఇసుకను డంప్ చేసి అక్కడ నుంచి కొద్ది కిలోమీటర్లు దాటించి తెలంగాణకు అక్రమంగా రవాణా చేస్తున్నారు.
మూడు నెలలుగా ఈ తతంగం సాగుతుంటే ఈ నెల 4న పోలీస్, రెవెన్యూ, మైనింగ్ విభాగాలు కలిసి 15 లారీలు సీజ్ చేశారు. మళ్ళీ బుధవారం 6 లారీలు సీజ్ చేశారు. గత మూడు నెలల కాలంలో తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వందకుపైగా ఇసుక అక్రమ రవాణా వాహనాలపై కేసులు నమోదు కావడం గమనార్హం.
కొవ్వూరు నుంచి టన్ను ఇసుక చింతలపూడికి అయితే రూ.700, ఖమ్మం జిల్లా కల్లూరుకి రూ. 1400, హైదరాబాద్‌కు రూ.3 వేలు రవాణా చార్జీతో కలిపి తీసుకుంటారు. ఒక్కొక్క లారీకి 20 టన్నులు, కొన్ని పెద్ద లారీలకు 30 టన్నులకు వేబిల్లు తీసుకుని ఆ మేరకు నగదు చెల్లిస్తారు. 20 టన్నుల లారీలో 40 టన్నులు, 30 టన్నుల లారీలో 60 నుంచి 70 టన్నులు లోడ్ చేసి భారీగా విక్రయిస్తున్నారు. సగటున చింతలపూడిలో 20 టన్నుల లారీ రూ.28 వేలు. అదే హైదరాబాద్‌కు అయితే లక్షకుపైగా వసూలు చేస్తున్నారు. కేవలం కొవ్వూరులోని రీచ్‌ల నుంచే అధికార పార్టీ అండదండలతో ఈ దందా సాగడం గమనార్హం. అది కూడా రెండు జిల్లాలు దాటించి సరిహద్దులో డంప్‌లు పెట్టి పొరుగు రాష్ట్రంలో విక్రయించడం చర్చనీయాంశంగా మారింది.
కొవ్వూరు నుంచి భారీగా తెలంగాణకు అక్రమ రవాణా
3 రీచ్‌ల నుంచి తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో డంపింగ్
అక్కడ నుంచి లారీల్లో తెచ్చి చింతలపూడిలో విక్రయాలు
3 నెలలుగా యథేచ్ఛగా సాగుతున్న అక్రమ దందా
రోజూ 90కు పైగా లారీల్లో సరిహద్దుకు రవాణా
టీడీపీ నేతలే నిర్వాహకులు

సరిహద్దుల్లో ఇసుక దందా

సరిహద్దుల్లో ఇసుక దందా