
వినతిపత్రం ఇస్తున్న సచివాలయ ఉద్యోగులు
భీమవరం (ప్రకాశంచౌక్): గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగుల సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా ఐక్యవేదిక సభ్యులు జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారి వై.దోసిరెడ్డికి నోటీసు అందజేశారు. ఇంటింటికీ తిరుగుతూ చేసే సర్వేల నుంచి విముక్తి కల్పించాలన్నారు.
గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను వారి సంబంధిత మాతృశాఖలకే అనుసంధానం చేయాలని, సమయ పాలన లేకుండా ఆదివారాలు, పండుగలు, సెలవుల్లో కూడా విధులు చేయించడం నిలిపివేయాలని కోరారు. నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, ఒకే క్యాడర్‌లో కొనసాగుతున్న ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరారు. పారదర్శక బదిలీలు జరిగేలా ప్రత్యేక విధి విధానాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు షేక్ ఉమర్ అలీషా, ఎం.వెంకటేష్, డి.స్వర్ణలత, కే ఆదిత్య, కే కళ్యాణి, టి.చాందిని తదితరులు పాల్గొన్నారు.
అధినేతతో భేటీ
ఏలూరు టౌన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమం, నియోజకవర్గంలో పార్టీ కమిటీల నియామకాలు, రాజకీయ పరిస్థితులను అధినేతకు వివరించారు.
వైఎస్సార్‌సీపీ వలంటీర్ల విభాగం అధ్యక్షురాలిగా పార్వతి
ఏలూరు టౌన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గానికి చెందిన మహిళా నేతకు జిల్లా పదవిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్‌సీపీ వలంటీర్ల విభాగం జిల్లా అధ్యక్షురాలిగా భోగిశెట్టి పార్వతిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా పదవి కేటాయించటం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం కార్యదర్శిగా నీరజ
చింతలపూడి: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా చింతలపూడి మండలానికి చెందిన మొలుగుమాటి నీరజా సుధాకర్‌ను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నీరజ ప్రస్తుతం చింతలపూడి జెడ్పీటీసీగా ఉన్నారు. తన సేవలను గుర్తించి రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్‌కు ఎంపిక
ద్వారకాతిరుమల: పంగిడిగూడెంకు చెందిన కస్సే పవన్‌కుమార్ అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు ఎంపికయ్యాడు. నెల వ్యవధిలోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో 6 పతకాలను సాధించి అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు. గత నెల 9న విశాఖలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 3 స్వర్ణ పతకాలను సాధించాడు. ఆగస్టు 29 నుంచి 31 వరకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో స్వర్ణ, రెండు రజత పతకాలు సాధించి అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌నకు ఎంపికయ్యాడు. డిసెంబర్ 7 నుంచి దుబాయ్‌లో జరిగే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటాడు.