
కామినేని రౌడీలను పెంచి పోషిస్తున్నారు
● ‘సేవ్ కై కలూరు’ పేరుతో త్వరలో విశ్రాంత ఉద్యోగులతో కమిటీ
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
కై కలూరు: పెంపుడు కొడుకుగా పేరొందిన రౌడీని కై కలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పెంచి పోషించడంతో అరాచకశక్తిగా మారి, అల్లరి మూకలను తయారు చేశాడని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) మండిపడ్డారు. కై కలూరులోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 5న దానిగూడెం దళితవాడకు చెందిన ఇద్దరి యువకులపై కత్తులతో దాడి జరిగితే ఎమ్మెల్యే అనుచరులు తనపైనా, తన కుమారులపైనా దాడి కుట్రను ఆపాదించడం సిగ్గుచేటన్నారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేయకుండా ఎవరు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. గొడవ జరిగిన వినాయక ఊరేగింపులో గంగానమ్మగుడి, సంతమార్కెట్, మసీదు సెంటర్, కొల్లేటికోటకు చెందిన అల్లరు మూకలు ఎందుకు ఊరేగింపునకు వచ్చారో ఆలోచించాలన్నారు. వారం రోజుల క్రితం వినాయక పందిరి వద్ద గొడవలో పోలీసులు చర్యలు తీసుకుంటే ఈ రోజు ఇంతటి దారుణం జరిగేది కాదన్నారు. ఎన్నికల్లో కలెక్షన్ల కోసం వచ్చి ఉంటున్నావారెవరనేది అందరికీ తెలుసన్నారు. రౌడీ మూకల అరచకాలకు అరికట్టడానికి నియోజకవర్గ స్థాయిలో అందరితో సంప్రదించి విశ్రాంత ఉద్యోగులతో శ్రీసేవ్ కై కలూరుశ్రీ పేరుతో కమిటీని ఏర్పాటు చేస్తానన్నారు.
పదవులు శాశ్వతం కాదు
పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చేబోయిన వీర్రాజు, పార్టీ ముదిరాజుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధనరావు మాట్లాడుతూ ఎవరికీ పదవులు శాశ్వతం కాదన్నారు. ఎంపీపీలు పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్, చందన ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కూటమి కార్యకర్తలు వైఎస్సార్‌సీపీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం దుర్మర్గమన్నారు. ఎస్సీ సెల్ నాయకుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, నాయకులు గోట్రూ ఏసుబాబు, మండల పార్టీ అధ్యక్షులు రాము, రామరాజు, నత్తగుళ్లపాడు సర్పంచ్ ముంగర కృష్ణంరాజు, నాయకులు సమయం అంజి, మడక శ్రీను పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దళితుల దాడిలో ప్రధాన నిందితుడు, అతడి అనుచరుల అరాచకాలను డీఎన్నార్ వెల్లడించారు. కై కలూరు గాంధీబొమ్మ సెంటర్‌లో టీడీపీ ఆర్యవైశ్య డైరెక్టర్ మల్యాద్రి దుకాణంపై మూకుమ్మడి దాడి, సంత మార్కెట్ వద్ద బ్యాటరీ నాయుడు దుకాణంపై దాడి, ఏలూరు రోడ్డు వద్ద చికెన్ దుకాణంపై, చింతపాడు వద్ద వడ్డి సామాజికవర్గ బృందంపై, పోలీసుస్టేషన్ ఎదుటే ఆర్యవైశ్య కిషోర్ దంపతులపై కాల్‌మనీ కేసులో దాడి చేశారన్నారు. అన్న క్యాంటీన్‌లో పేదలపై దాడి, వెలంపేటలో కాపు సామాజికవర్గానికి చెందిన గుర్రం అరవింద్‌పై దాడి, భుజబలపట్నంలో దళితవర్గానికి చెందిన విలేకరి కురేళ్ల కిషోర్‌పై దాడి, బైపాస్ రోడ్డులో విశ్రాంత రైల్వే ఉద్యోగిపై, డబ్బులు అడిగినందుకు సంత మార్కెట్ వద్ద ఫ్లెక్సీ ప్రింటర్‌పై దాడి వంటి ఘటనలు ఉదహరించారు.