
వైఎస్సార్‌సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు
కాలువ మట్టి తవ్వకుండా తవ్వారంటూ అధికారుల వేధింపులు
ద్వారకాతిరుమల: కూటమి నేతల అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు రోజురోజుకు పెచ్చు మీరుతున్నాయి. ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లి పంచాయతీ, తక్కెళ్లపాడులో ఇద్దరు వైఎస్సార్ సీపీ నాయకులపై బుధవారం కూటమి నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగారు. పొలం పనులు చేసుకుంటున్న వారిని కాలువ మట్టి తవ్వారంటూ వారి జేసీబీ, ట్రాక్టర్‌ను అధికారుల చేత సీజ్ చేయించారు. స్థానికుల క నం ప్రకారం. తక్కెళ్లపాడులో దామోదరరెడ్డికి చెందిన ఆయిల్‌పామ్ తోటలోకి ఉదయం 10 గంటల నుంచి, సత్తాలకు చెందిన వైఎస్సార్ సీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు కుంచే రాజేష్ ట్రాక్టర్ ఎరువు (పేడ)ను తోలుతోంది. ఎరువు లోడింగ్, ఇతర పొలం పనులకు తక్కెళ్లపాడు వైఎస్సార్ సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ముల్లంగి నీలకంఠరెడ్డి జేసీబీ పనిచేస్తోంది. మధ్యాహ్నం సమయంలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, పోలవరం కాలువ అధికారులు, పోలీస్ సిబ్బంది దామోదరరెడ్డి తోటకు 300 మీటర్ల దూరంలో ఉన్న పోలవరం కుడి కాలువ గట్టు వద్దకు వచ్చారు. అక్కడ మట్టి తవ్విన పాత ఆనవాలును చూసి, అది నీలకంఠరెడ్డి, రాజేష్‌లే తవ్వారని ఆరోపించారు. అయితే వారి జేసీబీ, ట్రాక్టర్ ఘటనా స్థలంలో లేవు. అయినా వారే తవ్వారంటూ అధికారులు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న నీలకంఠరెడ్డి, రాజేష్‌లు అధికారులను కలసి తమకు సంబంధం లేదని, తమ వాహనాలను పొలం పనులకు పెట్టామని చెప్పినా అధికారులు వినిపించుకోలేదు. మాకు ఒత్తిళ్లు వస్తున్నాయి. వాహనాలు పోలీస్టేషన్‌కు వెళ్లాల్సిందేనని తెగేసి చెప్పారని బాదితులు వాపోయారు. కూటమి నేతల అక్రమ తవ్వకాలను తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వారి వాహనాలను రాత్రి పోలీస్టేషన్‌కు తరలించారు. వీఆర్వో మీడియాతో మాట్లాడుతూ పోలవరం కాలువ పక్కన మట్టి తవ్వేసి ఉందని పై నుంచి ఫోన్‌లు వస్తే ఇక్కడికి వచ్చామని చెప్పారు.