
వృద్ధులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
ఏలూరు(మెట్రో): వయో వృద్ధులను ఇబ్బందులకు గురిచేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో వయో వృద్ధుల చట్టం నిబంధనలపై జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వయో వృద్ధుల సంరక్షణకు చట్టాలపై క్షేత్రస్ధాయిలో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. వృద్ధుల సమస్యలను పరిష్కరించే దిశగా వృద్ధులకు రక్షణ కల్పించేందుకు పోలీస్ శాఖలో నోడల్ అధికారిని నియమించాలని, ప్రతి పోలీస్ స్టేషన్‌లో వాలంటరీ కమిటీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సీనియర్ సిటిజన్స్ కేసులకు సంబంధించి డివిజన్ స్ధాయిలో 642 కై ్లయిమ్స్ అందగా వాటిలో ఇంతవరకు 515 పరిష్కరించామన్నారు. అక్టోబరు 1న వృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 21 నుంచి 30 వరకు వివిధ పోటీలు, వైద్య శిబిరాలు, కుటుంబ సంబంధిత కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, అందరికీ ఇళ్ల పరిశీలన కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే 175 మైనర్ ఇరిగేషన్ చెరువులకు సంబంధించి రూ.160.25 కోట్లతో మరమ్మతులు, పునరుద్ధరణ, పునర్నిర్మాణాలపై ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించేందుకు కలెక్టర్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి పరిశీలన కమిటీ ఆమోదించింది.
ఆక్వా వివరాలు పొందుపర్చాలి : జిల్లాలో ఆక్వా సాగు చేసే చెరువుల వివరాలను విలేజ్ ఆక్వా కల్చర్ యాప్‌లో పొందుపరచాలని కలెక్టర్ వెట్రిసెల్వి మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి విలేజ్ ఆక్వాకల్చర్ యాప్‌లో చెరువుల వివరాల నమోదుపై మత్స్య శాఖాధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
78,145 టన్నుల ఎరువుల పంపిణీ
జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఇంతవరకు 78,145 టన్నుల ఎరువులు అందించామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి చెప్పారు. సెప్టెంబర్ 11 నుంచి 13 మధ్య మరో 1,614 టన్నుల యూరియా జిల్లాకు రానుందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 1873 టన్నుల యూరియా, 2,952 టన్నుల డీఏపి, 4,437 టన్నుల ఎంఓపీ, 12,903 టన్నుల ఎన్‌పీకే, 665 టన్నుల ఎస్‌ఎస్‌టి ఎరువులు ఉన్నాయన్నారు.