
బిల్లుల పెండింగ్‌పై కాంట్రాక్టర్ల బెంగ
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం మున్సిపాలిటీకి సంబంధించి గత ప్రభుత్వం ఎన్నికల ముందు దాదాపు 90 శాతం బిల్లులు క్లియర్ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన పనులకు సంబంధించిన బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌కు పంపగా ఈ ఏడాది మార్చి 31న క్యాన్సిల్ చేశారు. అప్పటి నుంచి కాంట్రాక్టర్లకు పైసా బిల్లు అందలేదు. పలుమార్లు ఉన్నతాధికారులు, మున్సిపల్ మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. బుధవారం భీమవరంలో మున్సిపల్ కాంట్రాక్టర్లు మాట్లాడుతూ బిల్లులు అందక పడుతున్న ఇబ్బంది పడుతున్నామన్నారు. మార్చి 31న సీఎఫ్‌ఎంఎస్‌లో ఉన్న బిల్లుల్ని క్యాన్సిల్ చేశారని, నిధి పోర్టల్ తీసుకొచ్చి బిల్లులు అప్‌లోడ్ చేసుకోమన్నారు. ఏప్రిల్ 19 వరకూ బిల్లులు అప్‌లోడ్ చేశామని, ఆగస్టు 21 వరకూ భీమవరం మున్సిపాలిటీకి సంబంధించి సుమారు రూ.9 కోట్ల మేర 60 బిల్లులు అప్‌లోడ్ చేశామన్నారు. ఆ తర్వాత గ్రీన్ చానల్లో బిల్లులు అప్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. కొత్తగా ప్రతి నెలా 11 నుంచి 20 మధ్య బిల్లులు పెట్టుకోవాలని కమిషనర్లకు చెప్పారన్నారు. ఈనెల 4 నుంచి కొత్తగా అప్‌లోడ్ చేసిన బిల్లులకు పేమెంట్లు చేశారు. గత 15 నెలలుగా పెండింగ్ ఉన్న బిల్లులకు సంబంధించి ఎలాంటి పేమెంట్లు చేయకపోగా 4న అప్‌లోడ్ చేసిన బిల్లులు ఇవ్వడంతో వారు వాపోతున్నారు. ఒక్కొక్కరికి రూ.40 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకూ బిల్లులు బకాయిలు ఉన్నాయన్నారు. అటు జనరల్ ఫండ్ నుంచి గాని, ఇటు కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు ఫండ్స్ నుంచి గాని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం బాధాకరమన్నారు.