
జీవితంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి
నూజివీడు: జీవితంలో సవాళ్లను, సమస్యలను ఎదుర్కొనడానికి విద్యార్థి దశ నుంచే ధైర్యంతో సిద్ధంగా ఉండాలని ఎన్‌సీడీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జే నర్సింగరావు అన్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంను పురస్కరించుకొని విద్యాసంస్థల్లో ఆత్మహత్యల్ని నివారించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ సూచనల మేరకు పట్టణంలోని ట్రిపుల్ ఐటీలో బుధవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జేడీ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితుల వల్ల ఒత్తిడి పెరిగిపోయి వాటి నుంచి తట్టుకోలేక ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. విద్యార్థిపై ఎవరూ ఒత్తిడి చేయకూడదని, వారికిష్టమైన సబ్జెక్టును చదువుకునే స్వేచ్ఛ విద్యార్థికి ఇవ్వాలన్నారు. విద్యార్థుల మానసిక పరిస్థితిని బట్టి వారిలో ధైర్యాన్ని నిరంతరం నింపుతూ ఉండాలన్నారు. ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదని, చిన్న చిన్న కారణాలకే జీవితాన్ని చాలించాలనుకోవడం అవివేకమన్నారు. ఒక తలుపు మూసుకుపోతే, మరో తలుపు తెరిచే ఉంటుందన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. నిరంతరం పాజిటివ్ దృక్పథంతో ముందుకు సాగాలని, నిరాశ నిస్పృహలను దరిచేరనీయవద్దన్నారు.
నేనున్నాను అనే భరోసా ఇవ్వాలి
సైకియాట్రిస్టు డాక్టర్ కోమలి మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకోవడం నేరమని, అలాంటి ఆలోచన వచ్చిన వాళ్లను నిరంతరం గమనిస్తూ ఉండాలన్నారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్ల ప్రవర్తన వేరుగా ఉంటుందని, ఒక్కరే కూర్చోవడం, ఏడవడం, ఒంటరితనం, ఎవరూ లేరని బాధపడడం, మన బాధ వినేవారు ఎవరూ లేరని బాధపడడం అనే లక్షణాలతో బాధపడుతుంటారన్నారు. అలాంటి వాళ్లని గుర్తించి ప్రేమగా పలకరించాలని, నీకు నేనున్నాను అనే భరోసా ఇవ్వాలన్నారు. అనంతరం హాజరైన విద్యార్థులతో ఆత్మహత్యా నివారణా ప్రతిజ్ఞను చేయించారు. కార్యక్రమంలో నూజివీడు డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డా.జాస్తి జగన్మోహనరావు, ఏరియా ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీనివాసరావు, సైకాలజిస్ట్ కె.శ్రీనివాసరావు, ట్రిపుల్ ఐటీ సైకాలజీ అధ్యాపకుడు వేణుగోపాల్, డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ రాజేష్, చీఫ్ వార్డెన్‌లు సురేష్ బాబు, గౌతమి, పీయూసీ కోఆర్డినేటర్ రఘు తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌సీడీ జేడీ డాక్టర్ నర్సింగరావు