
ఖరీఫ్‌లో ఎరువుల గండం
నేడు వైఎస్సార్‌సీపీ అన్నదాత పోరు
రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేసే విషయంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందింది. పంటలకు పెట్టుబడి సాయం చేయకపోగా, కనీసం యూరియా కూడా సకాలంలో సరిపడా ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వ వైఫల్యం కాకపోతే ఏమనాలి. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఎంత యూరియా అవసరమో అంతా దిగుబడి చేసుకోవాలి. ప్రణాళిక లేకుండా విధి నిర్వహణ ఎలా చేస్తున్నారు? సరిపడా యూరియా దిగుబడి చేసుకోకపోతే సాగు చేసే రైతుల పరిస్థితి ఏమిటి? విజిలెన్స్ శాఖ అధికారులు నిరంతర తనిఖీ చేయాలే తప్ప అమావాస్యకు పౌర్ణానికి తనిఖీలు చేస్తే ఫలితాలు ఉండవు.
– పర్వతనేని నరేంద్రబాబు, రైతు, మలకచర్ల
కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసింది. రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు ధర్నాలు, ఆందోళనలు చేయడమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. ప్రభుత్వం ఏర్పడిన ఒక సంవత్సరంలోనే రైతుల సంక్షేమం, అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి, ప్రణాళిక ఉంటే యూరియా కొరత వస్తుందా? ఎన్నికల ముందు ప్రచార సభల్లో కూటమి నాయకులు చెప్పిన, ఇచ్చిన హామీలకు, ప్రభుత్వ ఏర్పాటు అనంతరం చేస్తున్న చర్యలకు తేడాను గమనిస్తున్న రైతులు తాము మోసపోయామని తెలుసుకున్నారు.
– మేడూరి రంగబాబు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
అన్నదాతకు ఎరువుల రూపంలో గండం మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో సజావుగా, సక్రమంగా దొరికే ఎరువుల కోసం.. కూటమి ప్రభుత్వ హయాంలో మళ్లీ సొసైటీల చుట్టూ అన్నదాతలు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. సొసైటీకి ఎరువులు ఎప్పుడు వస్తాయో తెలుసుకుని ఒకపూట క్యూలో పడిగాపులు కాస్తే రెండు, మూడు బస్తాలు దొరికితే గొప్ప అనే పరిస్థితి నెలకొంది. దాదాపు నెల రోజులుగా జిల్లాలో అన్నదాతను ఎరువుల సమస్య పట్టిపీడిస్తోంది. ఖరీఫ్ సీజన్‌లో 33,762 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉండగా, ఈ నెల ఐదో తేదీకి 8 వేల మెట్రిక్ టన్నులను మాత్రమే పంపిణీ చేశారు. సోమవారం ఏలూరులో హడావిడిగా సమీక్ష సమావేశం ఏర్పాటుచేసిన ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్.. రెండు రోజుల్లో 24 వేల మెట్రిక్ టన్నులు పంపిణీ చేశామని, జిల్లాలో ఎక్కడా కొరతే లేదంటూ ప్రకటించారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్రేనని, రైతులు చాలా సంతోషంగా ఉన్నారని ముక్తాయించారు. కట్ చేస్తే... సొసైటీల వద్ద, డీసీఎంఎస్ కేంద్రాల వద్ద భారీగా అన్నదాతలు బారులు తీరిన దృశ్యాలు సోమవారం కూడా కొనసాగడం గమనార్హం.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఖరీఫ్ సీజన్‌లో రైతుకు సకాలంలో ఎరువులు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఈ క్రమంలో రైతులకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం జిల్లా వ్యాప్తంగా అన్నదాత పోరు పేరిట ఆర్‌డీఓ కార్యాలయాల వద్ద భారీ నిరసన ర్యాలీలు, ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం నానా హైరానా పడుతూ అంతా బాగుంది.. అన్నీ అందుబాటులో ఉన్నాయంటూ కొత్త ప్రచారానికి తెర తీసింది. ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై అన్నదాత పోరు పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన నేపథ్యంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం ఏలూరులో హడావిడిగా అధికారులతో సమీక్ష ఏర్పాటు చేసి అన్నీ బాగున్నాయని ప్రకటించారు. ఖరీఫ్‌లో 33,762 మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరం ఉండగా 30,555 మెట్రిక్ టన్నులు పంపిణీ చేసేశామని, 2,200 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచుతామని, పామాయిల్, కోకో, మిర్చి, ఇతర ఉద్యానవన పంటల రైతులు కూడా ఎరువులు వాడుతున్నారని, జిల్లా వ్యాప్తంగా 530 పంపిణీ కేంద్రాలున్నాయని, ఎవరూ ఆందోళన పడవద్దని, జిల్లాలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారంటూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని, కావాలనే అలజడి సృష్టిస్తున్నారంటూ సమస్య వదిలి రాజకీయ విమర్శలకు దిగారు. జిల్లాలో ఎప్పుడు ఏర్పాటు చేశారో తెలియదు కానీ.. 29 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి బ్లాక్ మార్కెట్‌లో విక్రయించేవారిపై 12 కేసులు నమోదు చేసినట్టు కూడా ప్రకటించారు.
రెండు రోజుల్లో 24 వేల మెట్రిక్ టన్నుల పంపిణీ ఎలా?
జిల్లాలో గత శనివారానికి 8 వేల మెట్రిక్ టన్నుల పంపిణీ జరిగినట్టు అధికారిక సమాచారం. ఆగస్టులో 10,183 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా 5496 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. సెప్టెంబర్‌లో 7449 మెట్రిక్ టన్నుల అవసరానికి గాను ఐదో తేదీకి 2,512 మెట్రిక్ టన్నుల పంపిణీ పూర్తి చేశారు. మొత్తంగా రెండు నెలలు కలిపి 8008 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. శని, ఆదివారాలతో పాటు సోమవారం మధ్యాహ్నం నాటికి 30 వేల మెట్రిక్ టన్నులు రైతులందరికీ పంపిణీ చేశామని, అంతా బాగుందని అధికారుల నివేదికల సారాంశం. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ప్రతి సెంటర్ వద్ద భారీగా క్యూ లైన్లు, పడిగాపులు కొనసాగుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాలు ఉండటంతో ఐదేళ్లలో ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సమస్యే తలెత్తలేదు. అది కూడా సీజన్ ప్రారంభంలోనే అవసరమైన ఎరువులను నూరు శాతం పంపిణీ చేశారు. 2022–23లో 26,591 మెట్రిక్ టన్నులు, 2023–24లో 26,090 మెట్రిక్ టన్నులు, 2024–25లో 25,055 మెట్రిక్ టన్నుల యూరియాను జిల్లాలో రైతులకు అందించారు.
మంగళవారం ఉదయం ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెంలలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో ఎరువుల బ్లాక్‌మార్కెట్‌ను నిరసిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు.
డీసీఎంఎస్‌ల వద్ద భారీగా క్యూలైన్లు
రెండు రోజుల క్రితం వరకు జిల్లాలో 8 వేల మెట్రిక్ టన్నుల పంపిణీ
సోమవారం నాటికి 30 వేల మెట్రిక్ టన్నులు పూర్తి
అధికారుల గణాంకాలతో అవాక్కవుతున్న అన్నదాతలు
యూరియా కోసం సొసైటీల వద్ద తప్పని పడిగాపులు
గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ కొరత
హడావిడిగా ఇన్‌చార్జి మంత్రి సమీక్ష సమావేశం
ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అంటూ వ్యాఖ్యలు
అన్నదాతలకు మద్దతుగా నేడు వైఎస్సార్‌సీపీ ఆందోళన
ఆర్‌డీఓ కార్యాలయాల వద్ద నిరసన ర్యాలీలు, ధర్నాలు

ఖరీఫ్‌లో ఎరువుల గండం

ఖరీఫ్‌లో ఎరువుల గండం

ఖరీఫ్‌లో ఎరువుల గండం