
రైతు కన్నీరు సమాజానికి మంచిది కాదు
● అన్నదాత పోరును విజయవంతం చేద్దాం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
కై కలూరు: రైతు కన్నీరు కారిస్తే సమాజానికి మంచిది కాదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై రైతన్నకు బాసటగా వైఎస్సార్ సీపీ మంగళవారం ఏలూరులో చేపట్టే అన్నదాత పోరును రైతన్నలు, కార్యకర్తలు విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కై కలూరులోని పార్టీ కార్యాలయంలో పోరుబాట పోస్టర్‌ను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్షం రైతు సమస్యలపై ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తోందన్నారు. యూరియా సహా రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేసి, బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఎరువులను పక్కదారి పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఉచిత పంటల బీమాను పునరుద్ధరించి అందరికీ వర్తింపజేయాలన్నారు. వర్షాల కారణంగా పంట దెబ్బతిన్న రైతులకు వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏలూరులో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు వైఎస్ విగ్రహం వద్ద నివాళులర్పించి శాంతియుత ర్యాలీ నిర్వహించి, ఆర్డీవోకు వినతిపత్రం అందిస్తామని చెప్పారు. కై కలూరు నియోజకవర్గ ప్రజలు స్థానిక పార్టీ కార్యాలయానికి ఉదయం 8.30కి చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మేధావుల విభాగ కార్యదర్శి బీవీ రావు, రాష్ట్ర మైనారిటీ విభాగ కార్యదర్శి ఎండీ గాలిబ్ బాబు, పార్టీ నేతలు సింగంశెట్టి రాము, గుడివాడ వీర రాఘవయ్య, వడుపు రామారావు, జాస్తి బాబు రాజేంద్రప్రసాద్, పడమట శేషావతారం తదితరులు పాల్గొన్నారు.