
శ్రీవారి ఆలయంలో దొడ్డిదారిన గదులు అద్దెకు
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన ధర్మ అప్పారాయ నిలయం (120 గదుల సత్రం)లో సోమవారం దొడ్డిదారిన గదులు అద్దెకిచ్చి, సొమ్ము స్వాహా చేసిన ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరిని అధికారులు సస్పెండ్ చేశారు. మరో ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన కొందరు భక్తులు సోమవారం ఉదయం శ్రీవారి దర్శనార్థం టూరిస్టు బస్సులో కొండపైకి వచ్చారు. ముందుగా వారు స్నానాదుల కోసం రూములు తీసుకునేందుకు సీఆర్వో కార్యాలయానికి వెళ్లి అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి వంశీని వివరాలు అడిగారు. ధర్మ అప్పారాయ నిలయానికి వెళ్లి రూములు చూసుకోవాలని అతను సలహా ఇచ్చాడు. దీంతో వారు అక్కడికి చేరుకొని గుమాస్తాగా విధులు నిర్వర్తిస్తున్న శాశ్వత ఉద్యోగి సీహెచ్ పవన్‌కుమార్‌ను గదులు అద్దెకు కావాలని అడిగారు. అతను రూ.4500 నగదు తీసుకొని టికెట్లు లేకుండా 7 నాన్ ఏసీ గదులను అద్దెకు ఇచ్చాడు. దీనిపై సమాచారం అందుకున్న ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యనారాయణమూర్తి.. వెంటనే ఆలయ ఏఈఓలు మెట్టపల్లి దుర్గారావు, రమణరాజు, ఎలక్ట్రికల్ డీఈ టి.సూర్యనారాయణలతో కలసి ధర్మ అప్పారాయ నిలయానికి వెళ్లి తనిఖీలు జరిపారు. ప్రాథమిక విచారణలో జరిగింది వాస్తవమని, ఉద్యోగులిద్దరూ కుమ్మకై ్క ఇదంతా చేశారని అధికారులు తేల్చడంతో పవన్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఈఓ సత్యన్నారాయణమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. సీఆర్వో కార్యాలయ ఉద్యోగి వంశీని విధుల నుంచి తొలగించారు. స్వాహా అయిన సొమ్మును వారినుంచి వసూలు చేసి గదులకు అద్దె చెల్లించారు.
డబ్బులు తీసుకుని టికెట్లు లేకుండా 7 గదులు అద్దెకిచ్చిన సిబ్బంది
సమాచారంతో తనిఖీలు చేసిన ఆలయ అధికారులు
శాశ్వత ఉద్యోగి సస్పెన్షన్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి తొలగింపు