
ఎరువుల సరఫరాలో కూటమి విఫలం : సీపీఐ
ఏలూరు (టూటౌన్): రైతులకు ఎరువుల సరఫరాలో కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ సీపీఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టారు. ఏలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నానుద్దేశించి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎరువుల కొరతతో అల్లాడిపోతున్నారని, సొసైటీల వద్ద ఎండనక, వాననక క్యూలైన్లలో ఎరువుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా రైతుల కష్టాలను తీరుస్తామని, రైతులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత రైతులు పడుతున్న కష్టాలను, ఇబ్బందులను తొలగించడానికి ఏమాత్రం ప్రయత్నం చేయడంలేదని విమర్శించారు. నానో ఎరువుల కంపెనీలతో కుమ్మకై ్క రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం, అధికారులు ఎరువులు సరిపడా ఉన్నాయని చెబుతున్నా రాష్ట్రంలోని రైతులు క్యూ లైన్లలో నిలబడి పడిగాపులు కాస్తున్న విషయం అధికారులు దృష్టికి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. రైతులకు ఎరువులను సక్రమంగా అందించాలని, బ్లాక్ మార్కెట్లో ఎరువుల అమ్మకాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో 70 శాతం మాత్రమే వ్యవసాయం సాగు చేస్తున్నారని, అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అందించే యూరియా, డీఏపీ అధికంగా ఉండాలి గానీ కొరత ఎలా వచ్చిందని ప్రశ్నించారు. 30 శాతం సాగు తగ్గినప్పటికీ ప్రభుత్వం ఎరువులను అందించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉందా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, కురెళ్ల వరప్రసాద్, మావూరి విజయ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండల తహసీల్దార్ గాయత్రికి వినతిపత్రం అందజేశారు.