
యూరియా వినియోగం తగ్గించేలా చర్యలు
రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి నాదెండ్ల ఆదేశం
ఏలూరు (మెట్రో): జిల్లాలో యూరియా వినియోగం తగ్గించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో ఎరువుల సరఫరా, పంపిణీపై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్‌పామ్ సాగులో యూరియా వినియోగాన్ని తగ్గించేలా రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ఎరువులు సొసైటీలకు గతం కంటే ఎక్కువగా అందించే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుత ఏడాది 33,762 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటికే 30,557 మెట్రిక్ టన్నులు అందించామన్నారు. మరో రెండు రోజుల్లో 2200 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. గతంలో వచ్చిన ఈ–పోస్ యంత్రాల సాంకేతిక సమస్యలు ప్రస్తుతం రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యూరియా స్టాక్‌లు సొసైటీలకు అవసరమైన మేరకు ఒకేసారి అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు అమ్మడం వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ గత ఏడాది కన్నా ఈ ఏడాది రైతులకు అధికంగా ఎరువులను అందించామన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ మాట్లాడుతూ వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులను అందించాలన్నారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు యూరియా సరఫరా చేయాలని కోరారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రైతులకు ఎరువులను సక్రమంగా పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఎరువుల పంపిణీ చేస్తున్నామన్నారు. సమావేశంలో కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా, ఉద్యాన శాఖ అధికారి రామ్మోహన్, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్, మార్క్‌ఫెడ్ డీఎం ప్రసాద్‌గుప్త, రైతులు పాల్గొన్నారు.