
రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం
నూజివీడు: కూటమి ప్రభుత్వంలో అడుగడుగునా రైతులకు అన్యాయం జరుగుతోందని, రైతులకు న్యా యం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న యూ రియా కష్టాలను ప్రభుత్వానికి తెలియజేసి కనువిప్పు కలుగచేసేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈనెల 9న సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. ఈ మేరకు ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో అన్నదాత పోరు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మామిడి, పొగాకు, ఉల్లి, మిర్చి, మినుము, మొక్కజొన్న...ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విత్తనాల నుంచి యూరియా వరకు ఏదీ కూడా సరఫరా చే యలేని దుస్థితిలో పాలన చేస్తోందని ధ్వజమెత్తారు. పంటల బీమా ప్రీమియాన్ని గాలికొదిలేసిందన్నారు. యూరియా కోసం రైతులు గంటల తరబడి ఎదురుచూస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. గత ప్రభుత్వంలో రైతుభరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలోనే రైతులకు పూర్తిస్థాయిలో సేవలందించామని గుర్తు చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రంతో సంబంధం లేకుండా ఏడాదికి రూ.20వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు దానికి కూటమి ప్రభుత్వం కోత పెట్టిందన్నారు. నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు శీలం రాము, జడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు, క్రిస్టియన్ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు పిళ్లా చరణ్, అధికార ప్రతినిధి కంచర్ల లవకుమార్, నాయకులు పాల్గొన్నారు.