బ్రిటన్‌ మంత్రి కావడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌ మంత్రి కావడమే లక్ష్యం

Sep 8 2025 5:12 AM | Updated on Sep 8 2025 5:12 AM

బ్రిట

బ్రిటన్‌ మంత్రి కావడమే లక్ష్యం

సాక్షి, భీమవరం: బ్రిటన్‌ మంత్రి కావడమే తన లక్ష్యమని లండన్‌లోని రాయల్‌ బరో ఆఫ్‌ కెన్సింగ్టన్‌ అండ్‌ చెల్సియా డిప్యూటీ మేయర్‌ ఆర్యన్‌ ఉదయ్‌ ఆరేటి చెప్పారు. యూకే కాలేజీలో తెలుగు విద్యార్థుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి స్టూడెంట్‌ ఎన్నికల్లో గెలవడమే తన రాజకీయ ప్రవేశానికి కారణమని తెలిపారు. అనంతరం కన్జర్వేటివ్‌ పార్టీలో చేరి రెండుసార్లు కౌన్సిలర్‌గా గెలిచినట్లు చెప్పారు. భీమవరం సమీపంలోని తుందుర్రు గ్రామానికి చెందిన ఆర్యన్‌ ఉదయ్‌ ఇటీవల భీమవరం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీసాక్షిశ్రీతో మాట్లాడారు. తన బాల్యం, చదువు, బ్రిటన్‌ రాజకీయాల్లో ఎదుగుదల, తన లక్ష్యాల గురించి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

టెన్నిస్‌ కోసం లండన్‌కు

మాది భీమవరం పక్కనే ఉన్న తుందుర్రు. తాత నాయనమ్మల పేర్లు ఆరేటి వీరాస్వామి, గొబ్బిలమ్మ. తండ్రి వెంకటసత్యనారాయణ కేజీఆర్‌ ప్రిన్సిపల్‌గా పనిచేశారు. తల్లి విజయలక్ష్మి, సోదరి ఇంద్రాణి. 7వ తరగతి వరకు భీమవరంలోని సెయింట్‌ మేరీస్‌ స్కూల్‌లో చదువుకున్నా. అప్పటికే ఏపీ తరఫున టెన్నిస్‌ ఆడుతున్న నేను ఆటపై ఆసక్తితో 8వ తరగతి హైదరాబాద్‌లో చేరాను. స్కూల్‌ నేషనల్స్‌, ఇంటర్‌ స్టేట్‌ కాంపిటీషన్స్‌కు ఏపీ కెప్టెన్‌గా వ్యవహరించాను. నా స్నేహితులు చాలామంది యూఎస్‌, యూకే వెళ్లేవారు. గ్రాడ్యుయేషన్‌ తరువాత టెన్నిస్‌ కోసం యూకే వెళ్లాను. 2006లో ఏయూ స్కాలర్‌షిప్‌ రావడంతో లండన్‌లో ఎంఎస్‌ చేశాను.

రాజకీయాల్లోకి..

యూకే కాలేజీలో తెలుగు విద్యార్థుల పట్ల వివక్ష పూరిత సంఘటనలకు వ్యతిరేకంగా పోరాడేవాడిని. అప్పుడే స్టూడెంట్స్‌ ఎన్నికల్లో గెలవడం నాలో ఆత్మస్థైర్యం, నమ్మకం పెంచాయి. చదువు అనంతరం అక్కడే ఉండి బిజినెస్‌ చేసుకుంటూ కన్జర్వేటివ్‌ పార్టీ ఫాలోవర్‌గా ఉన్నాను. అక్కడి సిటిజన్‌షిప్‌ కూడా వచ్చింది. బ్రెగ్జిట్‌ టైంలో ప్రధాని డేవిడ్‌ కేమరూన్‌ టీంలో చేరాను. నా అనాలసిస్‌, స్ట్రాటజీని చూసి కన్జర్వేటివ్‌ పార్టీ తరఫున పనిచేయాలని ప్రోత్సహించేవారు. 2014లో పార్టీలో సభ్యుడిగా చేరాను. రెండు, మూడు సంవత్సరాలు పార్టీ విధివిధానాలు, రాజకీయ పరిస్థితులను సైలెంట్‌గా అబ్జర్వ్‌ చేస్తూ వచ్చాను. ఇక్కడి మాదిరి అక్కడ కూడా రాజకీయ పార్టీల్లో అంతర్గత విభేదాలు, వివక్ష కామన్‌.

సెంట్రల్‌ కౌన్సిలర్‌గా ఎన్నిక

నిజాం కాలేజీలో ఇంటర్‌ చదువుతున్న రోజుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆకర్షితుడినయ్యాను. లండన్‌లోను దేవాలయాలకు వెళ్లి దీపారాధన చేసేవాడిని. భారతీయులను, మన సంప్రదాయాలను ఎంతో గౌరవించే పార్టీ చైర్మన్‌, మాజీ మేయర్‌ జూలీమీల్స్‌ నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. అందరితో కలుపుగోలుతనం నాకు కలిసొచ్చింది. ఇంటర్నల్‌ ఓటింగ్‌లో తెల్లవాళ్లకంటే అత్యధిక మెజార్టీ సాధించడంతో 2017లో నాకు సీట్‌ డిక్లేర్‌ అయ్యింది. 2018లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి సెంట్రల్‌ కౌన్సిలర్‌గా గెలిచాను. కౌన్సిలర్‌ అంటే ఇక్కడ ఎమ్మెల్యేతో సమానం. 2022 ఎన్నికల్లోను వరుస విజయాన్ని అందుకున్నాను. లండన్‌లోని ముఖ్యమైన ప్రాంతానికి డిప్యూటీ మేయర్‌గా సుమారు రెండున్నర లక్షలమందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ప్లానింగ్‌, లైసెన్సింగ్‌, ఎన్విరాన్‌మెంట్‌ తదితర కీలక కమిటీల్లో సభ్యుడిగా ఉన్నాను. మేయర్‌ అందుబాటులో లేని సమయంలో ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. భారత్‌, బ్రిటన్‌ ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌లో ఆక్వా, ఎన్విరాన్‌మెంట్‌కు సంబంధించి కొన్ని పాలసీలు చేయాలని అనుకున్నాం. కానీ సెంట్రల్‌ స్థాయిలో మా పార్టీ ఓడిపోవడంతో అది సాధ్యం కాలేదు. భవిష్యత్తులో ఆ దిశగా కృషిచేస్తాను. దేవుడి దయతో ఈ స్థాయికి వచ్చాను. వచ్చే ఎన్నికల్లో మేయర్‌ కావాలన్నదే నా లక్ష్యం. ఎంపీ కావడం, అనంతరం మినిస్టర్‌ అవడం తదుపరి లక్ష్యాలు.

ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు

యువత కులమతాలు, ప్రాంతీయ విభేదాలు విడిచిపెట్టి అందరితో కలిసుండాలి. అనవసరమైన ఆర్భాటాలు, పబ్లిసిటీలకు దూరంగా ఉండాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయకుండా లక్ష్యాన్ని చేరేందుకు ముందుకు సాగాలి

యూకే స్టూడెంట్స్‌ ఎన్నికల్లో గెలుపే రాజకీయాల వైపు నడిపించింది

రెండుసార్లు కౌన్సిలర్‌గా గెలుపొందా

అందరితో కలుపుగోలుతనమే నా విజయ రహస్యం

‘సాక్షి’తో లండన్‌లోని కెన్సింగ్టన్‌ అండ్‌ చెల్సియా డిప్యూటీ మేయర్‌ ఆర్యన్‌ ఉదయ్‌

స్వస్థలం భీమవరంలో సహ విద్యార్థులతో మమేకం

బ్రిటన్‌ మంత్రి కావడమే లక్ష్యం1
1/1

బ్రిటన్‌ మంత్రి కావడమే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement