
పాము కాటుకు రైతు బలి
ద్వారకాతిరుమల: మండలంలోని సూర్యచంద్రరావుపేటలో ఒక రైతు పాము కాటుకు గురై మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చవల అశోక్ (23) వ్యవసాయం చేస్తుంటాడు. రోజులానే బుధవారం సాయంత్రం పొలానికి వెళ్లిన అశోక్ గడ్డి కోస్తుండగా కాలుపై తాచుపాము కరిచింది. వెంటనే అక్కడున్న రైతులు తొలుత భీమడోలు ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందాడు. అశోక్‌కి ఇంకా వివాహం కాలేదు. ఈ ఘటనపై మృతుడి తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు.
ఏలూరు(మెట్రో) : ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద చేతివృత్తి శ్రామికులకు, హస్తకళ నిపుణులకు బ్యాంకుల ద్వారా అందిస్తున్న ఎంఎంఎస్‌ఎంఈ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ కేఎస్ ప్రభాకరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మైనార్టీ అభ్యర్థులు, చేతివృత్తులు చేసుకుంటున్నవారు పీఎం విశ్వకర్మ డాట్ జీవోవీ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. వివరాల కొరకు కామన్ సర్వీస్ సెంటర్స్ లేదా వెబ్‌సైట్‌లో సంప్రదించాలన్నారు. ఇతర సమాచారం కొరకు జీఎం, జిల్లా పారిశ్రామిక కేంద్రం, ఏలూరు వారిని పనివేళలో సంప్రదించాలన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్) : ఈ నెల 7వ తేదీ చంద్ర గ్రహణం కారణంగా పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో మధ్యాహ్నం 12.30 గంటలకు మహానివేదన అనంతరం అమ్మవారి దర్శనం నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 8వ తేదీ ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో సంప్రోక్షణ జరిపిన అనంతరం ఉదయం 8.30 గంటల నుంచి యథావిధిగా దర్శనాలు అనుమతించనున్నట్లు ఆలయ సహా య కమిషనర్ బుద్ధ మహాక్ష్మి నగేష్ తెలిపారు.