
సినీ ఫక్కీలో సెల్‌ఫోన్ చోరీ
ద్వారకాతిరుమల: మీ బైక్ చక్రం బోల్టు ఊడిపోతోంది.. ఆపండి చూద్దాం.. అంటూ ఇద్దరు యువకులు బైక్‌పై వెళుతున్న ఒక వ్యాపారిని నమ్మించారు. బైక్ ఆపి చూస్తుండగా సినీ ఫక్కీలో ఆ వ్యాపారి జేబులోని సెల్‌ఫోన్‌ను తస్కరించారు. ఏలూరు ఆశ్రం ఆస్పత్రి వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనపై బాధితుడు ద్వారకాతిరుమల పోలీస్టేషన్‌లో బుధవారం ఉదయం ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే. ద్వారకాతిరుమలకు చెందిన ఫ్యాన్సీ షాపు వ్యాపారి కోరుప్రోలు సత్యన్నారాయణ వస్తువుల కొనుగోలు నిమిత్తం మంగళవారం మధ్యాహ్నం తన బైక్‌పై ఏలూరు వెళుతున్నాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు, సార్.. మీ బైక్ చక్రం బోల్టు లూజయ్యి ఊడిపోయేటట్టు ఉంది, చూద్దాం ఆపండని అన్నారు. అది నమ్మిన సత్యన్నారాయణ బైక్ ఆపాడు. దాంతో ఆ యువకులు సైతం తమ బైక్ ఆపగా, అందులో ఒక యువకుడు బైక్ దిగి వ్యాపారి వద్దకు వచ్చాడు. చక్రం తిప్పండి చూద్దాం అనడంతో వ్యాపారి కాస్త ఒంగాడు. అంతే సినీ ఫక్కీల్లో ఘరానా మోసగాడైన ఆ యువకుడు వ్యాపారి జేబులోని సెల్‌ఫోన్‌ను లాక్కుని బైక్‌పై పరారయ్యాడు. సదరు వ్యాపారి వారిని పట్టుకునేందుకు వెంబడించినా ఫలితం దక్కలేదు. దీనిపై వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ముదినేపల్లి రూరల్: యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబరుచుకుని మోసం చేసిన యువకుడిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని చేవూరుకు చెందిన యువతి 2020లో పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి గుడివాడలోని కళాశాలకు వెళ్లింది. అదే సమయంలో ప్రవేశం కోసం అక్కడికి వచ్చిన జంగారెడ్డిగూడెం మండలం కొయ్యలగూడెంకు చెందిన అంజూరి దివాకర్‌తో పరిచయం పెరిగింది. అది కాస్తా ప్రేమగా మారడంతో వివాహం చేసుకుంటానని నమ్మించి దివాకర్ ఆ యువతిని శారీరకంగా లోబరుచుకున్నాడు. అనంతరం వివాహం చేసుకోమని పలుమార్లు కోరినప్పటికీ అతడు తిరస్కరించాడు. దీనిపై పెద్దల సమక్షంలో పెట్టినా దివాకర్ తిరస్కరించాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
న్యాయం చేయాలంటున్న మహిళ
నూజివీడు: విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తనను ముగ్గురు వ్యక్తులు మోసం చేశారంటూ నూజివీడుకు చెందిన అమృతవల్లి బుధవారం విలేకరుల వద్ద వాపోయింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. అమృతవల్లి నివాసానికి సమీపంలో ఉంటున్న కాటుమాల శ్రీకాంత్, సంధ్య ఆమె భర్త మేడికొండ సాంబయ్య అనేవారు రూ.6 లక్షలు తీసుకుని ఖతార్ పంపారని, అయితే అక్కడ ఉద్యోగం ఏమీ లేదని, వెట్టిచాకిరీ చేస్తూ నరకం అనుభవించలేక రెండు నెలలకు తిరిగి వచ్చేసినట్టు ఆవేదన వ్యక్తం చేసింది. టూరిస్ట్ వీసాతో వీరు మోసం చేస్తున్నారన్నారు. విషయం బయటకు చెబితే ప్రాణాలు దక్కవంటూ బెదిరిస్తున్నారని వాపోయింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. దీనిపై తాను మంత్రి కొలుసు పార్థసారధి క్యాంపు కార్యాలయంలోని సిబ్బందికి ఫిర్యాదు చేశానని, గురువారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు అమృతవల్లి తెలిపారు.