
తల్లికి వందనం.. అంతా గోల్‌మాల్
అర్హత ఉందని చూపుతున్నా వివరాలు లేవు
ఒక్కరికీ పడలేదు
పీజీఆర్‌ఎస్‌కు వినతుల వెల్లువ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తల్లికి వందనం పథకం ద్వారా చదువుకునే ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి కేవలం 13 వేలు మాత్రమే వేశార. ఆ పథకంలో కూడా అనేక విధాలుగా కొర్రీలు పెట్టి ఈ పథకాన్ని గోల్‌మాల్ గోవిందం అనే రీతికి తీసుకొచ్చారు. ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం 12(1) (సీ) కింద ప్రతి పాఠశాలలో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు ఇవ్వడంలో భాగంగా జిల్లాలో అనేక పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకున్నారు. ఈ పథకం కింద ఒకటో తరగతిలో మాత్రమే ప్రవేశాలు కల్పిస్తారు. ఈ మేరకు ఈ ఏడాది ఒకటో తరగతిలో చేరిన పిల్లల తల్లులకు ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. ఒక బిడ్డకు ఉచిత విద్య సీటు లభించి రెండో బిడ్డ చదువుకు ప్రభుత్వం చెల్లించే తల్లికి వందనం పథకం డబ్బు రూ.15 వేలతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా చదివించవచ్చనుకున్న తల్లులకు ఉచిత విద్య పథకంలో సీటు వచ్చిందనే కారణం చూపి తల్లికి వందనం డబ్బులకు ఎగనామం పెట్టారు. ఈ విషయంలో మరో మెలిక ఏమిటంటే ఉచిత విద్యకు దరఖాస్తు చేసుకుని ఒక ప్రైవేట్ పాఠశాలలో సీటు పొందిన తల్లులు వివిధ కారణాలతో తమ బిడ్డలను సదరు పాఠశాలలో చేర్చకపోయినా వారు అక్కడే చదువుతున్నట్లు రికార్డుల్లో ఉంటోంది. ఉచిత విద్య చట్టం కింద తమ పాఠశాలలో నమోదైన విద్యార్థి పేరును సదరు పాఠశాల యాజమాన్యం తొలగించకుండా అలానే ఉంచడంతో అలాంటి తల్లులు తల్లికి వందనం పథకాన్ని కోల్పోయారు.
జిల్లాలో 3,23,306 మంది విద్యార్థులు
జిల్లాలో 1818 ప్రభుత్వ, 495 ప్రైవేటు పాఠశాలల్లో కలిపి 2,91,858 మంది విద్యార్ధులున్నారు. 127 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 31,448 మంది విద్యార్థులున్నారు. వీరందరికి మొత్తం రూ.486.96 కోట్లు జమ కావాల్సి ఉంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లాలో 1,78,214 మంది విద్యార్ధులకు రూ.267.32 కోట్ల చొప్పున ఏటా తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది.
ఎంతమందికి ఇచ్చారో లెక్కలేదు
జిల్లాలో తల్లికి వందనం పథకం కింద ఎంతమంది ఖాతాలకు డబ్బు జమ చేశారో లెక్కలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జిల్లాలో ఏ సంవత్సరం ఎంతమందికి అమ్మ ఒడి నగదు జమ చేసిందో అధికారికంగా లెక్కలు చూపింది. ఈ ప్రభుత్వం ఇంతవరకూ ఎంతమందికి నగదు జమ చేసిందో చెప్పే ధైర్యం చేయలేకపోతోంది. కనీసం మండలంలో ఎంతమందికి ఈ పథకాన్ని అమలు చేశారో అనే లెక్క మండల విద్యాశాఖాధికారి వద్ద కూడా దొరకడం లేదు.
నాకు ఇద్దరు పిల్లలు. ఈ ఏడాది తల్లికి వందనం పడలేదు. సచివాలయానికి వెళ్ళి విచారించగా ఆన్‌లైన్‌లో ఎలిజిబుల్ అని చూపిస్తోంది. ఎటువంటి వివరాలూ చూపించడం లేదు. వాట్సాప్ గవర్నెన్స్‌లో చూసుకుంటే తల్లికి వందనం రికార్డుల్లో మీరు లేరని వస్తోంది. నాకు ఎటువంటి ఆస్తులూ లేవు. నా భర్త కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. నాకు తల్లికి వందనం నగదు జమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– మొరా దుర్గాభవానీ, గృహిణి, ఏలూరు
నాకు ఇద్దరు పిల్లలు, గతంలో అమ్మ ఒడి ఒకరికి పడేది. ఇప్పుడు తల్లికి వందనం ఒక్కరికి కూడా పడలేదు. ఇద్దరికీ పడుతుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తే ఒక్కరికీ పడకపోవడం విచారకరం. నాకు తల్లికి వందనం పడకపోవడానికి కారణమేమిటో కూడా ఎవరూ చెప్పడం లేదు. ఎందువల్ల ఆగిందో తెలుసుకుంటే ఆ కారణం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
– పి.లలిత, గృహిణి, నూజివీడు
ఉచిత విద్య పథకం పొందితే రెండో బిడ్డకు డుమ్మా
ఇప్పటి వరకూ ఎంతమందికి ఇచ్చారో లెక్కలేదు
పీజీఆర్‌ఎస్‌కు తల్లుల వినతుల వెల్లువ
జూన్ 12న తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించారు. తమకు ఈ పథకం కింద నగదు జమకాలేదని తల్లులు ఎక్కే గడప, దిగే గడప అన్నట్లు తిరుగుతున్నా ఇంతవరకూ ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ పథకం కింద డబ్బులు జమకాని తల్లులు తొలుత పాఠశాలలకు, అనంతరం మండల విద్యాశాఖాధికారి కార్యాలయాలకు, అక్కడా ఫలితం లేకపోవడంతో జిల్లా విద్యాశాఖాధికారికి అర్జీలు సమర్పిస్తూనే ఉన్నారు. వారికి డబ్బు జమకావడం లేదు. ఇక చేసేదేమీ లేక చివరి ప్రయత్నంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతీ సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చి అర్జీలు సమర్పిస్తున్నారు. వారికి వచ్చే రూ. 15 వేల కోసం జిల్లాలోని సుదూర ప్రాంతాలైన కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం, నూజివీడు ఇలా అన్ని ప్రాంతాల నుంచీ పీజీఆర్‌ఎస్‌కు తల్లులు పోటెత్తుతున్నారు.

తల్లికి వందనం.. అంతా గోల్‌మాల్

తల్లికి వందనం.. అంతా గోల్‌మాల్