
మహిళపై దాడి.. కేసు నమోదు
ముదినేపల్లి రూరల్: మహిళపై దాడి ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులపై స్థానిక పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం పెనుమల్లి శివారు శింగారంలో వినాయకచవితి సందర్భంగా గత నెల 27న ఉత్సవాల వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో వాసుపల్లి నాగరాజు ఫొటో ముద్రించారు. అదే గ్రామానికి చెందిన జి రామకృష్ణ ఆగ్రహించి నాగరాజు ఇంటికి వెళ్లి ఫ్లెక్సీపై ఫొటో వేసుకునే స్థాయి నీకెక్కడిది అంటూ, ఎందుకు వేయించుకున్నావంటూ వినాయకచవితి రోజున దూషించాడు. అనంతరం సోమవారం రాత్రి గ్రామంలో జరిగిన అన్నసమారాధనకు నాగరాజు వెళ్లగా అక్కడ దాడి చేసేందుకు రామకృష్ణ యత్నించాడు. రామకృష్ణతోపాటు నాగరాజు, వీరబాబు వాసుపల్లి నాగరాజు ఇంటికి వెళ్లి రాడ్లతో దాడి చేయబోగా తప్పించుకోవడంతో అడ్డు వచ్చిన నాగరాజు భార్య మాధవికి తగిలి గాయాలయ్యాయి. దీనిపై బాధితురాలు మాధవి మంగళవారం ిఫిర్యాదు చేయగా ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఏలూరు (మెట్రో): ప్రకృతి వ్యవసాయాన్ని కేవలం వేతన ప్రాతిపదికన చేసే పనికాదని, సేవగా చూడాలని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ (డీపీఎం) వెంకటేష్ అన్నారు. మంగళవారం వ్యవసాయశాఖాధికారి కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫార్మర్ సైంటిస్టులు, ఏలూరు, కృష్ణా, ఎన్‌టీఆర్, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి మొత్తం 75 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీపీఎం వెంకటేష్ మాట్లాడుతూ డెల్టా ప్రాంతాల్లోని సభ్యులు వరి, మొక్కజొన్న పంటలకు వినూత్నమైన మోడళ్లను రూపొందించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రారంభ ప్రయత్నాలు విఫలమైనా సరే, ట్రయల్ అండ్ ఎరర్ పద్ధతిలో నిరంతరం ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగితే ఒక దశలో విజయం సాధించగలమన్నారు. రైతు సాధికారిక సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ గూగుల్ మీట్ ద్వారా సమావేశానికి హాజరై ప్రసంగించారు. పూర్తిగా రసాయనికంగా సాగు చేసిన భూమిని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా మార్పు చేసి, దిగుబడుల్లో ఎలాంటి నష్టం లేకుండా సాగు సాధ్యమవుతుందని ఒక ప్రామాణిక నమూనాను ప్రదర్శించారు.
20 కాసుల బంగారం చోరీ
పాలకొల్లు సెంట్రల్: పెళ్లి ఇంట్లో బంగారు ఆభరణాల చోరీపై కేసు నమోదైంది. మండలంలోని ఉల్లంపర్రు గ్రామంలో పెన్మెత్స సుబ్బరాజు ఇంట్లో ఇటీవల వివాహం జరిగింది. వివాహ వేడుక అనంతరం చూసుకోగా హారం, నల్లపూసలు, గొలుసు, తెలుపు గులాబి రంగు రాళ్ల ముత్యాల నక్లీసు, బంగారు గాజులు, దుద్దులు మొత్తం దాదాపుగా 20 కాసుల వరకూ బంగారు ఆభరణాలు పోయినట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.11 లక్షల వరకూ ఉంటుందని అంచనా. ఇంటిలో ఓ వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు సుబ్బరాజు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్సై బి. సురేంద్రకుమార్ తెలిపారు.