
మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం
ఏలూరు (టూటౌన్): కక్షిదారుల మధ్య సామరస్య వాతావరణంలో కౌన్సెలింగ్ నిర్వహించి కేసులు పరిష్కరించడమే మధ్యవర్తిత్వ లక్షణం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం అంశంపై వారం రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ తదితర ప్రాంతాలలో 1కే వాక్ నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించారు. మధ్యవర్తిత్వం చేసేందుకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 80 మంది న్యాయవాదులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, సోషల్ వర్కర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, ఈ కార్యక్రమం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని కక్షిదారులు, న్యాయవాదులు సంప్రదించి మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారాన్ని కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రెండో అదనపు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని, 7వ అదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాసరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.కె.వి.బులి కృష్ణ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి పి.ఎస్.వి.కృష్ణ సాయి తేజ, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.