
మున్సిపల్ టీచర్లపై సవతి తల్లి ప్రేమ
జిల్లా యూనిట్‌గా ప్రమోషన్లు ఇవ్వాలి
మున్సిపల్ ఉపాధ్యాయుల ఎంపిక జిల్లా యూనిట్‌గా జరుగుతుంది. జిల్లా యూనిట్‌గా పదోన్నతులు, బదిలీలు జరగాలి. పదోన్నతుల అవకాశాల కోసం మున్సిపల్ ఎడ్యుకేషనల్ యూనిఫైడ్ సర్వీసు రూల్సు విడుదల చేయాలి. మున్సిపల్ ఏరియాలలోని ఇతర యాజమాన్యంలోని పాఠశాలలను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో విలీనం చేయాలి.
– సోమరౌతు శ్రీనివాసరావు, ప్రోగ్రెసివ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
పదోన్నతులు కల్పించాలి
మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో ప్లస్ –2 ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలి. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులకు పదోన్నతులు ఇవ్వాలి. 1965 మున్సిపల్ చట్టం ప్రకారం మున్సిపల్ పాఠశాలల పర్యవేక్షణ కోసం మున్సిపల్ స్కూళ్ల సూపర్‌వైజర్ పోస్టులను గ్రేడు 2 హెచ్‌ఎం స్థాయిలో మంజూరు చేసి పదోన్నతులు ఇవ్వాలి.
– పోలిమెట్ల సుమంత్, ప్రోగ్రెసివ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల త్వరలో జరిగే బదిలీల్లో అర్హతలుండీ తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఒకే చోట పని చేస్తూ తమ సొంత ప్రాంతాలకు బదిలీ చేయించకునే అవకాశాలు లేక అల్లాడుతున్నారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్‌ను విస్మరించిన పాఠశాల విద్యాశాఖ విధానాలపై నిరసన గళం వినిపిస్తున్నారు. మున్సిపల్ ఉపాధ్యాయులను జిల్లా పరిషత్ ఉపాధ్యాయులతో సమానంగా పరిగణించాలని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ పాఠశాల విద్యాశాఖ చేస్తున్న చర్యలు, ప్రకటనలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 2022లో మున్సిపల్ పాఠశాలల పరిపాలన, ఉపాధ్యాయుల సేవలను పాఠశాల విద్యాశాఖకు బదలాయిస్తూ జీఓ 84 విడుదల చేశారు. పాఠశాల విద్యా శాఖ ఉమ్మడి సర్వీస్ రూల్స్ ముసాయిదా తయారుచేసి, ఉపాధ్యాయ సంఘాల సూచనలు, న్యాయశాఖ, జీఏడీ అభిప్రాయాల ఆధారంగా చివరి రూపకల్పన చేయాల్సిఉండగా దానిని ఆమోదించకుండా పాత నియమావళిని కొనసాగిస్తోంది. ఎన్నో సంవత్సరాల నుంచి బదిలీలు లేక వేచి చూస్తున్న సీనియర్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆశనిపాతంగా మారింది. మున్సిపల్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక ఉమ్మడి సర్వీస్ రూల్స్ వెంటనే ఆమోదించాలని, పదోన్నతులు, బదిలీలల్లో జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా వ్యవహరించాలని, అన్ని నియామకాల్లో పారదర్శకత, న్యాయం పాటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు కార్పొరేషన్‌ను కూడా ఇతర మున్సిపాలిటీలో సమానంగా పరిగణించి, అర్హులైన వారికి ఏలూరు కార్పొరేషన్‌కు, ఏలూరు కార్పొరేషన్ నుంచి ఇతర మున్సిపాలిటీలకు బదిలీ చేయడానికి వీలుగా నిబంధనలు సడలించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలుకాక నష్టపోతున్న టీచర్లు
జెడ్పీ ఉపాధ్యాయులతో సమానంగా పరిగణించాలి
జిల్లా యూనిట్‌గా పదోన్నతులు, బదిలీలకు డిమాండ్
ఉమ్మడి పశ్చిమలో 763 మంది మున్సిపల్ ఉపాధ్యాయులు..
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మున్సిపల్ పాఠశాలల్లో ప్రస్తుతం 763 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని అన్ని నగరపాలక సంస్థ పాఠశాలల్లో అన్ని కేటగిరీల్లో కలిపి 417 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు.

మున్సిపల్ టీచర్లపై సవతి తల్లి ప్రేమ

మున్సిపల్ టీచర్లపై సవతి తల్లి ప్రేమ