
అడుగంటిన మంచినీటి చెరువులు
భీమవరం అర్బన్: జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో రక్షిత మంచినీటి చెరువులు అడుగంటాయి. దీంతో ప్రజలు తాగునీటికి ఇక్కట్లు పడుతున్నారు. వేసవి ప్రారంభంలో అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా చెరువులను పూర్తిస్థాయిలో నీటితో నింపకపోవడమే సమస్యకు కారణమని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. భీమవరం మండలంలోని గొల్లవానితిప్ప, కొత్తపూసలమర్రు, దొంగపిండి, గూట్లపాడు, చినఅమిరం, కొవ్వాడ అన్నవరం, పెదగరువు, బేతపూడి తదితర గ్రామాల్లో రక్షిత మంచినీటి చెరువులు అడుగంటాయి. దీంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఫిల్టర్ బెడ్‌లు పనిచేయకపోవడంతో బురద నీటినే పంచాయతీ సిబ్బంది కుళాయిల ద్వారా అరకొర సరఫరా చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రతి ఏటా ఏప్రిల్ 15 తరువాత ఎప్పుడైనా పంటకాలువలు కట్టేస్తారు. ముందు జాగ్రత్తచర్యగా ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో మార్చి నెలాఖరు నుంచే రక్షిత మంచినీటి చెరువులు తాగునీటిని నింపాల్సి ఉంది. అయితే ఈ ఏడాది పెదగరువు, బేతపూడి గ్రామాల్లో రక్షిత మంచినీటి చెరువుల్లోను పూడిక తీత పనులు నిర్వహించడం, మిగిలిన గ్రామాల్లో ఏప్రిల్ చివరి వరకు తాగునీటి చెరువులను నింపకపోవడంతో మే నెల గడవకముందునే రక్షిత మంచినీటి చెరువులు అడుగంటాయి. అంతేకాకుండా కొన్ని గ్రామాల్లో వాడుక చెరువులలో నీటిని సైతం నింపకపోవడంతో అటు తాగునీటికి, ఇటు వాడకానికి నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుళాయిల ద్వారా అరకొర సరఫరా
పంచాయతీ సిబ్బంది రోజుకు గంట మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారని, ఆ నీరు కూడా బురదమయంగా ఉంటోందని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో 20 లీటర్ల మినరల్ వాటర్ రూ.30 నుంచి రూ.35కు కొనుగోలు చేసి తాగుతున్నామని, స్థోమత లేనివారు కుళాయిల ద్వారా వచ్చే బురదనీటినే తాగి అనారోగ్యాల పాలవుతున్నామని బాహాటంగానే చెబుతున్నారు.
గ్రామాల్లో దాహం కేకలు
చెరువులను పూర్తిస్థాయిలో నింపకపోవడంతోనే సమస్య
బురద నీరు వస్తుంది
కుళాయిల ద్వారా రోజుకు ఒక గంట మాత్రమే తాగునీరు ఇస్తున్నారు. అది కూడా బురదగా వస్తుంది. ఇంటి వాడకానికే తప్ప తాగడానికి ఆ నీరు పనికి రావడం లేదు. డబ్బులుంటే మినరల్ వాటర్ కొనుక్కుని తాగుతున్నాం. లేకుంటే ఆ నీటినే తాగాల్సి వస్తుంది.
– మేళం సోమన్న, గ్రామస్తుడు, గొల్లవానితిప్ప
గంట మాత్రమే ఇస్తున్నారు
గ్రామానికి శివారు కావడంతో రోజుకు గంట మాత్రమే తాగునీటిని ఇస్తున్నారు. ఇంటింటికి కుళాయిలు ఇవ్వలేదు. పంచాయతీ కుళాయిల ద్వారా వచ్చే నీటినే తెచ్చుకుంటున్నాం. అవి మురికిగా వస్తున్నాయి. – దేవిరెడ్డి వెంకటలక్ష్మి,
గృహి ణి, హౌసింగ్ కాలనీ, గొల్లవానితిప్ప

అడుగంటిన మంచినీటి చెరువులు

అడుగంటిన మంచినీటి చెరువులు

అడుగంటిన మంచినీటి చెరువులు

అడుగంటిన మంచినీటి చెరువులు