
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి
ఏలూరు(మెట్రో): ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 267 దరఖాస్తులను స్వీకరించారు. దివ్యాంగుల వద్దకు వచ్చి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కామవరపుకోట మండలం రామన్నపాలెంకు చెందిన వ్యక్తి అంగన్‌వాడీ సూపర్ వైజర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ. 3 లక్షలు తీసుకున్నాడని.. నేటి వరకు డబ్బులు తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని టి.నర్సాపురం మండలం బొర్రంపాలెంకు చెందిన తోట రమేష్ ఫిర్యాదు చేశాడు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటివారి ప్రలోభాలకు గురై మోసాలకు గురికావద్దని హితవు పలికారు.
తమ భూమిలో ఆక్రమణలు తొలగించేందుకు భూమిని సర్వేచేసి అప్పగించాలని ఆగిరిపల్లి మండలం తాడేపల్లికి చెందిన కందుల వెంకటేశ్వరమ్మ కోరారు. కూనలమ్మకుంట చెరువు ఆక్రమణకు గురైందని, సదరు ఆక్రమణలు తొలగించి రైతులకు న్యాయం చేయాలని కామవరపుకోటకు చెందిన ఉప్పలపాటి ఝాన్సీరాణి అర్జీనిచ్చారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ అర్.విజయరాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యం.ముక్కంటి తదితరులు వినతులు స్వీకరించారు.