విద్యుత్‌ తీగలు.. యమపాశాలు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ తీగలు.. యమపాశాలు

May 24 2025 1:26 AM | Updated on May 24 2025 1:26 AM

విద్య

విద్యుత్‌ తీగలు.. యమపాశాలు

ఆదమరిస్తే అంతే!

ఆక్వా చెరువుల వద్ద అస్తవ్యస్తంగా విద్యుత్‌ వ్యవస్థ

నిర్లక్ష్యంగా విద్యుత్‌ తీగల ఏర్పాటు

విద్యుదాఘాతాలతో ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు

వర్షాకాలంలో సమస్య మరింత జటిలం

రెండు రోజుల క్రితం ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు

సాక్షి, భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2.63 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. ఏరి యేటర్లు ద్వారా చెరువుల్లోని చేపలు, రొయ్యలకు నిరంతరంగా ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు త్రీఫేస్‌ విద్యుత్‌ను వినియోగిస్తారు. చెరువు చుట్టూ ఉండే ఈ వైర్లను అందరికీ కనిపించేలా కర్రలకు కట్టాలి. ఏరియేటర్‌ కనెక్షన్‌ వద్ద టేపు ఎక్కువగా వేయాలి. చెరువుల చుట్టూ ఉండే వైర్లకు ఎక్కువగా జాయింట్లు లేకుండా చూసుకోవాలి. వైర్లను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ కాలం చెల్లిన వాటిని తొలగించి కొత్త వాటిని ఏర్పాటుచేయాలి. ఎలక్ట్రీషియన్‌ను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. అయితే ఇలాంటి జాగ్రత్తలేమీ తీసుకోవడం లేదు.

ఎలాపడితే అలా వైర్లు..

రెండు ఎకరాల నుంచి వంద ఎకరాలకు పైగా ఆక్వా సాగు చేస్తుంటారు. సాగు విస్తీర్ణం పెరిగే కొద్దీ వైర్లు ఎలా పడితే అలా లాగేస్తున్నారు. కొందరు ప్రభుత్వ స్థలాలు, రహదారులు, కాలువ గట్లపై జాగ్రత్తలు పాటించకుండా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. వైర్లను కొబ్బరి చెట్లకు వేలాడదీయడం, రోడ్డుపైన, చెరువు గట్లపై నుంచి లాగేస్తున్నారు. కొంతకాలానికి మట్టి, గడ్డి కప్పేయడంతో అవి కనిపించని పరిస్థితి. కొత్తగా వచ్చిన కూలీలకు గట్టుపై ఉన్న వైర్లలో జాయింట్లు ఎక్కడ ఉన్నాయో తెలియక షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఏరియేటర్లు, మెటార్లు మొరాయిస్తుంటాయి. ఎలక్ట్రీషియన్‌ అందుబాటులో లేక కూలీలే మరమ్మతులు చేసే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారు.

జిల్లావ్యాప్తంగా ఎందరో..

జిల్లావ్యాప్తంగా ఏటా చెరువుల వద్ద ఎందరో విద్యుత్‌ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండగా వారి కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి. కొన్ని కేసులు వరకు వస్తే మరికొన్ని గుట్టుచప్పుడు కాకుండా సర్దుబాటు చేస్తున్నారు. చెరువుల వద్ద పనిచేసే వారిలో ఒడిసా, పశ్చిమ బెంగాళ్‌ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఎక్కువ. స్థానిక పరిస్థితులపై అవగాహన లేక ప్రమాదాలు బారిన పడే వారిలో వారే అధికంగా ఉంటున్నారు. చెరువుల వద్ద విద్యుత్‌ వ్యవసపై తనిఖీలు చేసేందుకు విద్యుత్‌శాఖ చర్య లు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాగా ట్రాన్స్‌ఫార్మర్లు వరకే తమకు బాధ్యత అనే ధోరణిలో విద్యుత్‌ అధికారులు ఉంటున్నారు.

అప్రమత్తత అవసరం

వర్షాకాలం దృష్ట్యా ఇళ్ల వద్ద కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

భారీ వర్షాలు, గాలులు వీచే సమయంలో విద్యుత్‌ లైన్ల కింద నిల్చోకూడదు. ఇంటి గృహోపకరణాల స్విచ్‌లను ఆఫ్‌ చేసుకోవాలి.

తడి చేతులతో స్విచ్చ్‌లను ఆన్‌, ఆఫ్‌ చేయకూడదు.

చిన్న పిల్లలను కరెంటు వస్తువుల వద్దకు వెళ్లనివ్వకూడదు.

ఇంటి సర్వీసు వైరు తెగినా, జాయింట్లు కట్‌ అయినా వెంటనే విద్యుత్‌ సిబ్బందికి స మాచారం ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో వాటిని తాకకూడదు.

వర్షం పడుతున్నపుడు విద్యుత్‌ స్తంభాలు, స్టే వైర్లను తాకరాదు.

చెట్లు, విద్యుత్‌ స్తంభాలు పడినా, వాలినా, కరెంటు వైర్లు తెగినా వెంటనే విద్యుత్‌ సిబ్బంది లేదా టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912కు సమాచారం అందించాలి.

మోటార్లు తడిసి షార్ట్‌ సర్క్యూట్‌ జరిగే ప్రమాదం ఉన్నందున రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలి.

మృత్యు ఘంటికలు

గతంలో భీమవరం రూరల్‌ గొల్లవానితిప్పలో ఒక రైతు తమ చెరువులో మేత వేసేందుకు వెళుతుండగా హైటెన్షన్‌ విద్యుత్‌ వైరు తగిలి ప్రాణాలు కోల్పోయాడు.

గూట్లపాడు రేవులో రొయ్యల చెరువు వద్ద విద్యుత్‌ వైరు తగిలి మరో రైతు మృతిచెందాడు.

తాడేరులో రొయ్యల చెరువు వద్ద గట్టుపై గడ్డి కోస్తుండగా కొడవలికి విద్యుత్‌ వైరు తగిలి కూలీ కన్నుమూశాడు.

దొంగపిండిలో చెరువు వద్ద పనిచేసే వ్యక్తి చెరువులో ఏరియేటర్‌ను రిపేరు చేసేందుకు దిగి మృత్యువాత పడ్డాడు.

ఉండి మండలం వెలిపర్రులోని ఆక్వా చెరువుల వద్ద బుధవారం బోదెలో చేపలు పట్టేందుకు దిగిన యువకుడు పక్కనే విద్యుత్‌ స్తంభం నుంచి వేలాడుతున్న వైరు తగిలి విద్యుత్‌ షాక్‌తో మృతిచెందాడు. అదే రోజున ఏలూరు రూరల్‌ లింగారావుగూడెం చెరువు వద్ద విద్యుదాఘాతానికి గురై ఒకరు మృతిచెందగా మరొకరు గాయపడ్డారు. రొయ్యలు, చేపలకు ఆక్సిజన్‌ అందించేందుకు ఆక్వా చెరువుల వద్ద విద్యుత్‌ వైర్లు ఏర్పాటులో అధికారులు, నిర్వాహకుల నిర్లక్ష్యం అమాయకుల ఉసురు తీస్తోంది. వర్షాకాలంలో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది.

విద్యుత్‌ తీగలు.. యమపాశాలు 1
1/2

విద్యుత్‌ తీగలు.. యమపాశాలు

విద్యుత్‌ తీగలు.. యమపాశాలు 2
2/2

విద్యుత్‌ తీగలు.. యమపాశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement