
1 నుంచి డిపోల వద్దే రేషన్
ఏలూరు(మెట్రో): జిల్లాలో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణతోపాటు ఏడు రకాల సేవలను పారదర్శకంగా పునః ప్రారంభించినట్టు జిల్లా పౌర సరఫరాల అధికారి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి.శివరామ్మూర్తి తెలిపారు. శుక్రవారం ఏలూరులో సివిల్ సప్లయీస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల సేవలు ప్రారంభించామని, ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. రైస్ కార్డు సేవలపై సందేహాలు ఉంటే కంట్రోల్ రూమ్ నం. 1800 425 6453లో సంప్రదించాలని కోరారు. ఎండీయూ వాహనాలను రద్దు చేసి జూన్ 1 నుంచి చౌకధరల దుకాణాల వద్దే రేషన్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అలాగే జిల్లాలో ధాన్యం కొనుగోలు పారదర్శకంగా నిర్వహించా మని శివరామ్మూర్తి తెలిపారు. రబీలో 20,416 మంది రైతుల నుంచి రూ.579 కోట్ల విలువైన 2.51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.502 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు.