
అనధికార మద్యం విక్రయాలపై చర్యలు
ఏలూరు టౌన్: జిల్లాలోని మద్యం దుకాణాల్లో నిర్దేశిత సమయాన్ని పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత హెచ్చరించారు. ఏలూరులోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో 144 మద్యం దుకాణాల యజమానులు నిబంధనల మేరకు సమయాన్ని పాటించాలన్నారు. షెడ్యూల్ బిజినెస్ ప్రకారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ మాత్రమే మద్యం షాపులు తెరిచి ఉంచాలని, అప్పుడు మాత్రమే మద్యం విక్రయాలు చేయాలని చెప్పారు. ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయని తమకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రాత్రి 10 గంటల అనంతరం మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. దుకాణాలు మూసివేసి పక్కనే బడ్డీ కొట్లు, ఇతర ప్రాంతాల వద్ద అనధికార మద్యం విక్రయాలు చేస్తే సంబంధిత షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోజూ రాత్రి వేళల్లో తనిఖీలు, నిఘా ఉంచాలని అధికారులకు డీసీ శ్రీలత సూచించారు.