
ఉపాధ్యాయుల బదిలీలపై అవగాహన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని యూటీఎఫ్ జిల్లా కేంద్ర కార్యాలయంలో ఉపాధ్యాయుల బదిలీలు, సర్దుబాట్లపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ హనుమంతరావు పాల్గొని బదిలీల జీఓలపై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయుల సందేహాలు, సమస్యలపై పరిష్కారాలు తెలిపారు. కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌ను ప్రారంభించారు. హెల్ప్‌డెస్క్‌లో ఉపాధ్యాయులతో ఆన్‌లైన్ దరఖాస్తులు చేయించడంలో జిల్లా సాంకేతిక బృందం పనిచేస్తుందని నాయకులు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రాక్షి రవికుమార్ మాట్లాడుతూ ప్రధాన నాయకులు జిల్లా కార్యాలయంలో అందుబాటులో ఉంటూ ఉపాధ్యాయుల సమస్యలను డీఈఓ కార్యాలయ అధికారుల దృష్టికి తీసుకువెళుతున్నారన్నారు. రాష్ట్రస్థాయిలో సమస్యలపై రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళుతున్నామన్నారు. బదిలీల ప్రక్రియ పూర్తయ్యే వరకూ హెల్ప్‌డెస్క్ కొనసాగుతుందన్నారు. జిల్లా అధ్యక్షుడు షేక్ ముస్తఫా ఆలీ, రాష్ట్ర కార్యదర్శి బి.సుభాషిణి, జిల్లా కోశాధికారి జీవీ రంగమోహన్, జిల్లా కార్యదర్శులు నంబూరి రాంబాబు, జి.అంజన, కె.కమల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.