కుక్కునూరు: పోలవరం పరిహారం చెల్లింపులో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు నిర్వాసితులను అయోమయానికి గురిచేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక గత జనవరిలో ప్రాజెక్ట్ 41.15 కాంటూర్ పరిధి బ్యాక్ వాటర్‌లో ముంపునకు గురవుతున్న గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ వ్యక్తిగత, ఇంటి విలువకు ప్యాకేజీ చెల్లించింది. వ్యక్తిగత ప్యాకేజీ దాదాపు అందరికీ జమ కాగా ఇంటి విలువకు సంబంధించిన పరిహారం మాత్రం కొందరికి మాత్రమే జమచేశారు. చాలా మంది నిర్వాసితులకు ఇంటి విలువలకు సంబంధించిన పరిహారం జమ కాలేదు.ఇ ఈ సంవత్సరం పరిహారం చెల్లింపు ఉంటుందా లేదా అన్న మీమాంసలో నిర్వాసితులు ఉన్నారు.
పోలవరం సర్వేలో భాగంగా నిర్వాసితుల ఇళ్లకు సంబంధించి సర్వే చేసి కొలతలు సేకరించిన సిబ్బంది వాటిని కంప్యూటరైజ్డ్ చేశారు. అనంతరం ప్రదర్శించిన రెండు జాబితాల్లో ఉన్న నిర్వాసితుల పేర్లు మూడో జాబితాలో లేకుండా పోయాయి. తమ పేర్లు జాబితా నుంచి గల్లంతైన విషయం తెలిసిన నిర్వాసితులు అధికారులను కలిసి వివరించారు. అధికారులు సిబ్బందిని నిర్వాసితుల ఇళ్లకు పంపి ఇంటి కొలతలు, తగిన ఆధారాలు, ఇంటి ఫొటోలు సేకరించారు. అయితే జాబితాలో వారి పేర్లు నమోదు చేశారా? లేదా అనేది నిర్వాసితులకు చెప్పలేదు. మండల స్థాయి అధికారులు నిర్వాసితులకు సంబంధించిన వివరాలు నిజమేనని ధ్రువీకరించి జిల్లా అధికారులకు పంపినప్పటికీ జిల్లా స్థాయి అధికారులు నిర్వాసితులకు న్యాయం చేయడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పేర్లు గల్లంతైన నిర్వాసితులు ఎప్పటికి న్యాయం జరుగుతుందోనని ఎదురుచూస్తున్నారు.
పోలవరం నిర్వాసితుల ఎదురుచూపులు